
విద్యార్థి బలవన్మరణం
మడకశిర రూరల్: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెందిన విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈచలెడ్డి గ్రామానికి చెందిన నాగరాజుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు. చిన్న కుమారుడు మనోజ్ (15) బుళ్లసముద్రం ఉన్నతపాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా చదువుకోవాలని, పాఠశాలకు సక్రమంగా వెళ్లాలని తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి మందలించారు. మనస్తాపానికి గురైన మనోజ్ అదే రోజు రాత్రి నిద్రించడానికని గదిలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. ఉన్న ఇద్దరు కుమారులు ఊహించని విధంగా చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అములుకున్నాయి. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, సర్పంచ్ చెన్నయ్య, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, పార్టీ వివిధ విభాగాల సభ్యులు మంజునాథ్, సికిందర్, రఘు, చౌడప్ప, తిప్పన్న, దివాకర్ తదితరులతో కలిసి ఆస్పత్రిలో మనోజ్ మృతదేహాన్ని పరామర్శించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

విద్యార్థి బలవన్మరణం