
సత్యసాయి శత జయంతి వేడుకలకు రాష్ట్రపతికి ఆహ్వానం
న్యూస్‌రీల్
ప్రశాంతి నిలయం: త్వరలో జరగనున్న సత్యసాయి బాబా శత జయంతి వేడుకలలో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ముర్మును ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు కలసి ఆహ్వానించారు. ట్రస్ట్ అందిస్తున్న విద్య, వైద్య, ఆరోగ్య, సామాజిక సేవల గురించి రాష్ట్రపతికి వివరించారు. ఒడిశాలో సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి సుముఖత వ్యక్తం చేసినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. కాగా.. రాష్ట్రపతిని ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ చైర్మన్ మల్లికా శ్రీనివాస్ కూడా కలిశారు.
గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంతకల్లు జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య (07498) ఈ నెల 18వ తేదీ మాత్రమే రైలు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ రైలు బేగంపేట, వికారాబాద్, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుతుందన్నారు. ధర్మవరం–షోలాపూర్ (01438) ఈ నెల 18న శనివారం మాత్రమే ధర్మవరం జంక్షన్ నుంచి బయలుదేరుతుందన్నారు. కదిరి, పీలేరు, పాకాల, తిరుపతి, రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, వికారాబాద్, బీదర్ మీదుగా షోలాపూర్ చేరుతుందన్నారు.