
యువకుడి దుర్మరణం
పెనుకొండ: స్థానిక జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తెలంగాణ లోని షాద్‌నగర్‌కు చెందిన సేవేనాయక్... ఐచర్ వాహన డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడు రమేష్‌నాయక్ (25)తో కలసి ఐచర్ వాహనంలో సరుకు లోడు చేసుకుని బుధవారం రాత్రి బెంగళూరుకు బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున పెనుకొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై యోగా లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్దకు చేరుకోగానే అప్పటికే రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని వెనుక నుంచి ఐచర్ ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన రమేష్ నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెనుకొండ పీఎస్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సేవేనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఆటో బోల్తా – బాలుడి మృతి
పెనుకొండ రూరల్: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని రాజేంద్రనగర్‌కు చెందిన ఓ కుటుంబం పెనుకొండ బాబయ్య దర్గా దర్శనానికి గురువారం ఆటోలో బయలుదేరింది. పెనుకొండ మండలం హరిపురం వైజంక్షన్ వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇర్షాద్ (11) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన షబ్రీన్, వదిహ, మహబూబీను స్థానికులు వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న షబ్రీన్‌ను హిందూపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై కియా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వరుస దొంగతనాలు
పావగడ: తాలూకాలోని తిరుమణి గ్రామంలో పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో పట్టపగలే వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. కిలారి వెంకటేశ్ తన కుమారుడి వివాహానికి సంబంధించి పెళ్లి పత్రికలు పంచేందుకు గురువారం కళ్యాణదుర్గం వెళ్లారు. ఇంటికి తాళం వేసి భార్య నారాయణమ్మ వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు ఉదయం 9 గంటల సమయంలో తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 6 తులాల బంగారు నగలు, రూ .2.70 లక్షల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. అలాగే కిలార్లహళ్లి గ్రామంలో బ్యాడనూరు చంద్రశేఖర్ ఆచారీకిచెందిన రీవైండింగ్ దుకాణంలో దుండగులు చొరబడి రూ.3 లక్షల విలువైన 2 కొత్త మోటార్లు, 3 రీవైండింగ్ మోటార్లు, 5 బాక్సుల కేబుల్‌ను అపహరించారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రైల్వే ఉద్యోగి బలవన్మరణం
పెనుకొండ: తన విద్యార్హతలకు తగిన ఉద్యోగం రాలేదంటూ ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాజస్తాన్‌కు చెందిన లోకేష్ మీనా (29) 2022లో రైల్వే గేట్‌మెన్‌గా ఎంపికై పెనుకొండలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఉన్నత చదువులు అభ్యసించిన తాను పలు ప్రయత్నాలు చేసిన అందుకు తగిన ఉద్యోగం రాలేదనే మానసిక వేదనలో ఉండేవాడు. ఈ క్రమంలోనే కొన్ని రోజులు క్రితం భార్య రాజస్తాన్‌కు వెళ్లింది. దీంతో రైల్వే క్వార్టర్స్‌లోని తన ఇంట్లో ఒంటరిగా ఉన్న లోకేష్ మీనా బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి విధులకు హాజరు కాకపోవడంతో తోటి ఉద్యోగితో పాటు ఉన్నతాధికారులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోయింది. గురువారం ఉదయం సైతం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి ఉద్యోగులు ఇంటి వద్దకు చేరుకుని కిటికిలో నుంచి చూడడంతో ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంబసభ్యులు రాజస్తాన్‌లో ఉండడంతో ప్రతి అంశాన్ని పోలీసులు వీడియో తీశారు. కుటుంబసభ్యులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.
కారు దగ్ధం
పెనుకొండ రూరల్: స్థానిక 44వ జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. కియా పోలీసులు తెలిపిన మేరకు.. రామగిరి మండలం పెనుబోలుకు చెందిన చంటి వ్యక్తిగత పనిపై బుధవారం రాత్రి కారులో బెంగళూరు వైపు బయలుదేరాడు. గుట్టూరు సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చంటి అప్రమత్తమై కారులో నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న కియా పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే లోపు కారు పూర్తిగా కాలిపోయింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు కియా పోలీసులు తెలిపారు.

యువకుడి దుర్మరణం

యువకుడి దుర్మరణం