
సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి
ఎన్‌పీకుంట: సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. గురువారం ధనియానిచెరువు గ్రామంలో రైతులు సాగు చేసిన వివిధ రకాల పంటలను వ్యవసాయాధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సేంద్రియ వ్యవసాయ ప్రాముఖ్యత, ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుకునే విధానాలను వివరించారు. మండల వ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదు చేసిన ఈ క్రాప్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ధనియానిచెరువు పంచాయతీ పరిధిలో గుర్తించిన ప్రభుత్వ భూములను ఎన్‌టీపీసీ, రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టా కలిగిన భూములకు లీజు ప్రాతిపదికన ఎకరాకు రూ.30వేలు చొప్పున చెల్లిస్తారని, రెండేళ్లకు ఒకసారి 5 శాతం చొప్పున లీజు పెంచి ఇస్తారని తెలిపారు. అంతకు ముందు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కదిరి ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఏడీఏ సనావుల్లా, ఎంఏఓ లోకేశ్వరరెడ్డి, ఎస్‌ఐ వలీబాషా, రెవెన్యూ అధికారులు, ఆర్‌ఎస్‌కే సిబ్బంది పాల్గొన్నారు.
సాగులో రైతుకు సాయంగా నిలవండి
కదిరి అర్బన్: పంటల సాగులో రైతులకు తగిన సూచనలిస్తూ సాయంగా నిలవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ వ్యవసాయ శాస్త్రవేత్తలకు సూచించారు. గురువారం ఆయన స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధనా స్థానంలోని పంట ప్రదర్శన క్షేత్రాలు, ప్రయోగశాలలు, విత్తన యూనిట్లను పరిశీలించారు. క్షేత్రంలో సాగు చేస్తున్న విత్తన వేరుశనగ రకాలు, దిగుబడి, సాంకేతికత, రైతులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. కదిరి పరిశోధనా స్థానంలో ఉత్పత్తయిన వేరుశనగ వంగడాలు దేశంలోని ఎంతో ఖ్యాతిగాంచాయని ప్రధాన శాస్త్రవేత్త భాస్కర్‌రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దార్ మురళీకృష్ణ, శాస్త్రవేత్త కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
కర్మాగారంలో ప్రమాదం
తాడిపత్రి టౌన్: మండలంలోని అయ్యవారిపల్లి వద్ద ఉన్న సుగుణ స్పాంజ్ ఐరన్ పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రమాదం చోటు చేసుకుంది. ద్రవరూపంలో ఉన్న ఇనుము కార్మికులపై పడడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కంబగిరి రాముడు, సునీల్, జార్జ్ ఉన్నట్లుగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గుట్టుగా ఉంచింది. క్షతగాత్రులను తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రహస్యంగా మరో నగరంలోని ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కార్మికులతో పని చేస్తుండటంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ధనియానిచెరువు గ్రామంలో పంటలను పరిశీలిస్తున్న
కలెక్టర్ శ్యాంప్రసాద్
కలెక్టర్ శ్యాంప్రసాద్