
మహిళా చట్టాల అమలులో ప్రభుత్వాలు విఫలం
అనంతపురం అర్బన్: మహిళా రక్షణ చట్టాల అమలులో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి మండిపడ్డారు. ఫలితంగా దేశంలోను, రాష్ట్రంలోను మహిళలకు రక్షణ కరువైందన్నారు. బేటీ బచావో... బేటీ పడావో అని మాటల్లో చెబుతున్నా.. ఆచరణలో చూపించడం లేదని ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి, కోశాఽధికారి సావిత్రి, జిల్లా కార్యదర్శి చంద్రిక, నాయకురాలు నాగమణితో కలిసి విలేకరులతో పుణ్యవతి మాట్లాడారు. మహిళల సమస్యలపై సోమవారం నుంచి మూడు రోజుల పాటు అనంతపురం నగరంలో జరగనున్న ఐద్వా రాష్ట్ర మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి మహిళకు ఆడబిడ్డనిధి కింద ప్రతి నెల రూ.1,500, వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలు వరకు ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హమీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాట వాటిని అమలు చేయలేదన్నారు. వీటిపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. మహాసభల్లో భాగంగా సోమవారం నగరంలో ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందన్నారు.
ఐద్వా అఖిల భారత కోశాధికారి పుణ్యవతి