
మళ్లీ దగాపడిన మహిళలు
పెనుకొండ: చంద్రబాబు పాలనలో ప్రతిసారీ దగాపడుతూ వచ్చిన మహిళలు... తాజాగా మరోసారి మోసపోయారు. మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంచుతామని, ఇందు కోసం ప్రభుత్వం తరఫున కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టుమిషన్లు అందజేస్తామంటూ గొప్పలకు పోయిన ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన కుట్టు శిక్షణ కేంద్రాలు మూడు నెలలు తిరక్కనే మూతపడ్డాయి. శిక్షణ పొందిన వారికి కుట్టుమిషన్లు అందజేయకుండా ప్రభుత్వం మొండి చెయ్యి చూపింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా... కుట్టు శిక్షణ ఇచ్చి హామీ నెరవేర్చకపోవడం సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ముచ్చటగా మూడు నెలలే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల అనంతరం మహిళలకు స్వయం ఉపాధి పథకం కింద బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కుటు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి అజిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న మొత్తం 85 కేంద్రాలను ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేశారు. 18 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న 9,500 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం బీసీ కార్పొరేషన్ అందించే రుణాలతో తమ బతుకుల్లో వెలుగులు నిండుతాయని అందరూ భావించారు. ఎంతో ఆశతో 3 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్లుమిషన్లు, రుణాలు అందజేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. శిక్షణ పూర్తి చేసుకుని 4 నెలలు దాటినా ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ కుట్టు మిషన్ అందలేదు. నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం కానీ, మంత్రులు కాని పెదవి విప్పక పోవడం గమనార్హం.
అతివల ఆర్థిక స్వావలంబనకు తూట్లు
ప్రచారార్భటంతోనే సరిపెట్టిన
కూటమి సర్కార్
ఉమ్మడి జిల్లాలో 85 కేంద్రాల్లో 9,500 మంది మహిళలకు కుట్టు శిక్షణ
మూతపడిన కేంద్రాలు..
కనిపించని కుట్టుమిషన్ల జాడ
ముగ్గురు మంత్రులు ఉన్నా
మహిళలకు అన్యాయమే
సిబ్బందికీ అందని వేతనాలు
ఒక్కో శిక్షణా కేంద్రానికి ఒక శిక్షకుడితో పాటు, కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించారు. పెనుకొండ నియోజకవర్గంలోని 28 సెంటర్‌లకు మాత్రం ఇద్దరు టీచర్లను నియమించారు. వీరికి శిక్షణ అందించే టీచర్‌కు నెలకు రూ. 15 వేలు, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ. 12 వేలు వేతనం ఇవ్వాలి. 3 నెలల్లో సిబ్బందికి అరకొర వేతనాలు ఇచ్చి మిగిలిన వేతనాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, బీసీ సంక్షేమ, చేనేత జౌళీశాఖ మంత్రి సవిత, వైద్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ ఉన్నా.. మహిళలకు మాత్రం న్యాయం జరక్కపోవడం విశేషం. ఇది నిరవధిక ప్రక్రియ అని మంత్రులు ప్రారంభ సమయంలో పేర్కొన్నారు. అయితే మొదటి విడతకే నిధులు విడుదల కాక దిక్కులేని పరిస్థితి ఉంటే ఇక రెండో విడత ఎలా మొదలు పెడతారో మంత్రులే చెప్పాలి.