
హక్కుల సాధనకు ఉద్యమించాలి
అనంతపురం అర్బన్: చట్టాల అమలు, హక్కుల సాధనకు ఉద్యమించాలని మహిళలకు ఐద్వా జాతీయ కార్యదర్శి మరియం ధావలే పిలుపునిచ్చారు. అనంతపురంలో నిర్వహించిన ఐద్వా 16వ రాష్ట్ర మహాసభలకు రెండవ రోజు మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాద విధానాలను అవలంబిస్తూ మనువాదం అమలుకు ప్రయత్నిస్తూ మహిళల హక్కులను హరించేందుకు సిద్ధమవుతోందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమూ బీజేపీతో కలిసి పనిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమై ప్రజలను ఐక్యపరిచే విధంగా ఐద్వా కృషి చేయాలన్నారు. మహిళలు పనిచేసే చోట సరైన భద్రత లేదన్నారు. కనీస వేతనం అమలు కావడవం లేదన్నారు. వ్యవసాయంలో మహిళల పాత్ర క్రియాశీలకమన్నారు. ప్రధానంగా పాడిరంగంపై ఆధారపడిన మహిళలు అధికంగా ఉన్నారన్నారు. పాడి పరిశ్రమను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఉపాధి హామీ పథకం అమలు సరిగ్గా లేకపోవడంతో మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారు. దళితులు, మహిళలపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకురాళ్లు రమాదేవి, హేమలత, రాణి, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప, ఆవాజ్ రాష్ట్ర కార్యద్శి చిస్తి మాట్లాడారు. కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి టీచర్, జాతీయ కోశాధికారి పుణ్యవతి, రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతమ్మ, కోశాధికారి సావిత్రి పాల్గొన్నారు.
ఐద్వా మహాసభల్లో జాతీయ కార్యదర్శి ధావలే

హక్కుల సాధనకు ఉద్యమించాలి