
ఉద్యాన అభివృద్ధికి కేంద్రం సహకారం
అనంతపురం అగ్రికల్చర్: క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (సీడీపీ) కింద ఉద్యాన పంటల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందింస్తున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) సహకారం అందిస్తోందని ఉద్యానశాఖ సీడీపీ రాష్ట్ర కన్సల్టెంట్ విద్యాశంకర్ తెలిపారు. మంగళవారం అనంతపురంలోని ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఉమ్మడి జిల్లాల ఉద్యానశాఖ అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్‌తో కలిసి అధికారులు, రైతులు, ఎంటర్‌ప్రెనూర్స్‌కు వర్క్‌షాపు నిర్వహించారు. విద్యాశంకర్ మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటికే అరటి పంటను క్లస్టర్ కింద ఎంపిక చేసి ఎస్‌కే సంస్థ, ప్రెష్‌కార్టు సంస్థలకు సీడీపీ పథకం అమలుకు ప్రాథమికంగా అనుమతులు ఇచ్చామన్నారు. జిల్లా పరిధిలో కనీసం రూ.100 కోట్లు విలువ చేసే పంటను ఎంపిక చేసుకుని ముందుకు వచ్చే సంస్థలు, ఎఫ్‌పీఓలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. 20 శాతం వాటా భరిస్తే... 20 శాతం బ్యాంకు రుణం, 20 శాతం సభ్యులైన రైతుల వాటా, మిగిలిన 40 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో అందిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో దానిమ్మ, చీనీ, అరటి, టమాట, మిరప, కర్భూజా, కళింగర పంటలకు సీడీపీ కింద తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. విత్తనం, మొక్కలు, ఎగుమతులు, కల్టివేషన్, పోస్ట్ హార్వెస్టింగ్, బ్రాండింగ్, లాజిస్టిక్స్ అంశాలపై ఏదైన ఒక పంటను ఎంపిక చేసుకున్న సంస్థ తమ దగ్గరున్న వనరులు, మౌలిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టు అందిస్తే అనుమతులు జారీ చేస్తామన్నారు. దీని వల్ల ఎఫ్‌పీఓలు, సంస్థలు ఆర్థికంగా పరిపుష్టి సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు ఉంటాయన్నారు. నాణ్యమైన పంట పండించడంతో పాటు బ్రాండింగ్ ద్వారా మార్కెటింగ్ పరిస్థితి మెరుగై ఎగుమతుల ద్వారా ఉద్యాన పంటల ద్వారా రైతుల ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.
వర్క్‌షాపులో రాష్ట్ర ఉద్యానశాఖ
కన్సల్టెంట్ విద్యాశంకర్