
ఊరుబావిని శుభ్రం చేయించండి
● కలెక్టర్ శ్యాం ప్రసాద్
పుట్టపర్తి అర్బన్: మండలంలోని వెంకటగారిపల్లిలో ఉన్న ఊరుబావిని శుభ్రం చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం వెంకటగారిపల్లి గ్రామంలో చేపట్టిన ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. డీపీఓ సమత, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 20వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శుభ్రత, పర్యావరణ సంరక్షణ, చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలోని ఊరుబావి వర్షపు నీళ్లతో నిండుగా ఉందని, వెంటనే శుభ్రం చేయిస్తే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందన్నారు. బావిలోకి చెత్తాచెదారం వేయకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు. గ్రామీణ ప్రాంతాలను ఆరోగ్యంగా తీర్చి దిద్దడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శుభదాస్, తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి, ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డి, సర్పంచ్ లక్ష్మీనరసమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు చిన్నారులను
రక్షించిన పోలీసులు
పాకాల: తప్పిపోయి రైల్వేస్టేషన్‌లో తచ్చాడుతున్న ఇద్దరు చిన్నారులను చిత్తూరు జిల్లా పాకాల పోలీసులు కాపాడారు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన మోహన్‌రాజ్ కుమారుడు కుమ్మర వరుణ్, సురేంద్ర కుమారుడు సి.తరుణ్ ఈ నెల 11న తప్పిపోయినట్టు తల్లిదండ్రులు సీకేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పాకాల రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా కనిపించిన చిన్నారులను గమనించిన రైల్వే పోలీసుల సమాచారంతో పాకాల పోలీసులు అక్కడకు చేరుకుని వారిని ఆధీనంలోకి తీసుకున్నారు. విచారణ అనంతరం సీకేపల్లి మండలానికి చెందిన వారుగా నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో సీకేపల్లి పోలీసులు మంగళవారం పాకాలకు చేరుకుని చిన్నారులను ఆధీనంలోకి తీసుకున్నారు.

ఊరుబావిని శుభ్రం చేయించండి