
కారును ఢీకొన్న టాటా ఏస్
చింతామణి: కారును టాటా ఏస్ ఢీకొన్న ఘటనలో తండ్రీకొడుకు గాయపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి తాలూకా చిన్నసంద్ర వద్ద ఆదివారం జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి తాలూకా వడ్డుమరవపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి తన కుమారుడు భానుప్రకాష్‌తో కలిసి బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. కారులో స్వగ్రామానికి వెళ్తుండగా చిన్నసంద్ర వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వస్తున్న టాటా ఏస్ డ్రైవర్ ఓవర్‌టేక్ చేయబోతూ కారును ఢీకొనడంతో రెండు వాహనాలు రోడ్డుకు అవతల దూసుకెళ్లాయి. టాటా ఏస్ బోల్తా పడింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జనుజ్జయింది. అందులోని తండ్రీకొడుకు గాయపడ్డారు. స్థానికులు స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్ర స్థాయి గోల్ షూట్ విజేత అనంత
కదిరి అర్బన్: ఈ నెల 11, 12వ తేదీల్లో చిత్తూరు జిల్లా నేరేబైలు గ్రామంలో జరిగిన రాష్ట్ర స్థాయి గోల్ షూట్ పోటీల బాలికల విభాగంలో ఉమ్మడి అనంతపురం జట్టు విజయం సాధించింది. అబ్బాయిల విభాగంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా గోల్‌షూట్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్నకుమార్ ఆదివారం వెల్లడించారు.