
పడకేసిన పట్టణాభివృద్ధి
సాక్షి, పుట్టపర్తి: కూటమి ప్రభుత్వం వచ్చాక ‘పుడా’ ఉనికి కోల్పోయింది. ఏడాది దాటినా చైర్మన్ నియామకం చేయలేదు. దీంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా తగ్గిపోయింది. నగరం నుంచి మారుమూల గ్రామాల వరకు అభివృద్ధే లక్ష్యంగా పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పుడా) పరిధిని రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. 1992లో ఆరు గ్రామాలతో ఏర్పడిన పుడాను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రణాళికలో భాగంగా మౌలిక వసతులు, గృహ నిర్మాణ ప్రాజెక్టులను మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల నుంచి పల్లెల వరకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆరు మండలాలకు విస్తరించారు. ఆ తర్వాత మరో ఐదు రెవెన్యూ గ్రామాలను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పుడా పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది. మొత్తం 82 రెవెన్యూ గ్రామాలు పుడా పరిధిలో ఉన్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పుడా పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. అక్రమాలకు తావు లేకుండా.. ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుతం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చైర్మన్‌ను కూడా నియమించలేదు. అభివృద్ధి సంగతి పక్కన పెడితే.. అవినీతి పెరిగిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు మొదలయ్యాయి. కూటమి నేతల కనుసన్నల్లోనే భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిసింది.
చైర్మన్ పదవికి పోటాపోటీ..
పుడా చైర్మన్ పదవికి ఆశావహులు తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. అయితే ఎవరికీ ఇవ్వకుండా మాజీ మంత్రి అడ్డుపుల్ల వేస్తున్నట్లు సమాచారం. తనకు ప్రొటోకాల్ పోతుందనే భయంతో జాప్యం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఎవరికి ఇచ్చినా.. తనకు పోటీ వస్తారనే భయం కూడా ఉండటంతో అధిష్టానం వద్ద మాజీ మంత్రి ఏదో కారణం సాకు చూపుతూ అడ్డగిస్తున్నట్లు సమాచారం. దీంతో ఏడాదిన్నర కాలంగా పుడా చైర్మన్ పదవి ఖాళీగానే ఉంది. ఎంతో మంది ఆశావహులు.. తమకే వస్తుందనే ధీమాలో ఉండటం గమనార్హం.
ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
పుడా పరిధిలోనుంచి పుట్టపర్తి మున్సిపాలిటీని మినహాయించారు. దీంతో మున్సిపాలిటీలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. అనుమతులు కొంత.. అక్రమం ఇంకొంత అన్న చందంగా మారింది. పుట్టపర్తి నుంచి పుడా కార్యాలయానికి వెళ్లే దారిలో సాయి సూపర్ బజారు పక్కన ఏడంతస్తుల భవనం ఉంది. కోకోనట్ గార్డెన్ దగ్గర యజమాని ఎవరో తెలియకుండానే.. కబ్జా చేసిన భూమిలో ఓ పెద్ద భవనం వెలుస్తోంది. మున్సిపల్ అధికారులు పలుమార్లు వెళ్లి నోటీసులు ఇచ్చినా.. ఫలితం లేదు.
ఏడాదిన్నరగా ‘పుడా’ పాలన అస్తవ్యస్తం
కూటమి ప్రభుత్వంలో చైర్మన్‌ను నియమించని వైనం
చైర్మన్ పదవికి ఆశావహులు ఎక్కువ కావడంతోనే జాప్యం
‘పుడా’ నిర్వీర్యంతో పుట్టపర్తి వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
ప్రస్థానం ఇలా..
1992 ఫిబ్రవరి 18న పుడా (పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పడింది. పుట్టపర్తి, కప్పలబండ, బ్రాహ్మణపల్లి, లోచర్ల, బీడుపల్లి, ఎనుములపల్లి గ్రామాలు ఉండేవి. మొత్తం 86.54 చదరపు కిలోమీటర్లు.
1996 సెప్టెంబరు 3న పుడా పేరును సుడా (శ్రీసత్యసాయి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)గా మార్పు చేశారు.
2007 ఫిబ్రవరి 28న సుడా పేరు తొలగించి ‘పుడా’గా మార్చారు.
2022 మే 13న ఆరు మండలాలకు పుడా పరిధిని విస్తరించారు. పుట్టపర్తి నియోజకవర్గం మొత్తం (అమడగూరులోని ఐదు రెవెన్యూ గ్రామాలు మినహా) పుడా పరిధిలోకి తీసుకొచ్చారు. ఫలితంగా 1,407.87 చదరపు కిలోమీటర్లు విస్తరించింది.
2022 నవంబరు 7న అమడగూరు మండలంలోని చీకిరేవులపల్లి, దండెవారిపల్లి, కరిమిరెడ్డిపల్లి, రామానంతపురం, ఎస్.కురువపల్లె రెవెన్యూ గ్రామాలను చేర్చారు. మరో 9.258 చదరపు కిలోమీటర్లు చేరడంతో పుడా మొత్తం పరిధి 1417.13 చదరపు కిలోమీటర్లకు చేరింది.

పడకేసిన పట్టణాభివృద్ధి