
పాఠశాలలో విధ్వంసం
పుట్టపర్తి అర్బన్: కంబాలపర్తి ప్రాథమిక పాఠశాలలోకి ఇద్దరు పిల్లలు చొరబడి విధ్వంసం సృష్టించారు. ప్రధానోపాధ్యాయులు రామాంజనేయులు తెలిపిన సమాచారం మేరకు... ఆదివారం మధ్యాహ్నం కంబాలపర్తికి చెందిన ఇద్దరు పిల్లలు పాఠశాలలోకి ప్రవేశించారు. నేరుగా హెచ్‌ఎం గదిలోకి వెళ్లి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన కోడిగుడ్లు విసిరికొట్టారు. రికార్డులు చెల్లాచెదురు చేసి పడేశారు. చిక్కీలు, బియ్యం, ఆయిల్ పారబోశారు. గదిలోంచి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఏం జరుగుతోందోనని పాఠశాలలోకి వచ్చారు. తెరిచి ఉన్న తలుపులను వేసి గడియపెట్టారు. అనంతరం ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయులు వచ్చి చూడగా లోపల ఇద్దరు పిల్లలు కనిపించారు. ఎవరని ఆరా తీస్తే ఒకరు మంగళకర పాఠశాల విద్యార్థి, మరొకరు చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థి అని తేలింది. గతంలో పాఠశాలలో అసభ్యకరంగా గోడలపై రాయడంతో.. హెచ్‌ఎం గమనించి తీవ్రస్థాయిలో మందలించారు. దీన్ని మనసులో పెట్టుకుని పాఠశాలలోకి ప్రవేశించి బీభత్సం చేసినట్లు ఒప్పుకున్నారు. వెంటనే వారి తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. అనంతరం పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మందలించి.. నష్ట పరిహారం కట్టేలా ఎస్‌ఐ లింగన్న పంచాయితీ చేసి పంపించారు.
హెచ్‌ఎంపై కోపంతో ఇద్దరు చిన్నారుల దుశ్చర్య

పాఠశాలలో విధ్వంసం