
పుట్టపర్తిలో పటిష్ట భద్రత
పుట్టపర్తి టౌన్: భగవాన్ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో పటిష్ట భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సహకారంతో రూ.1.39 కోట్ల వ్యయంతో అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆదివారం గణేశ్ కూడలిలో భూమిపూజ చేశారు. మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, ఎస్పీ సతీష్‌కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, ఆర్డీఓ సువర్ణ హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ నవంబర్ 23న జరగనున్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి వీఐపీలు, వీవీఐపీలు పది లక్షల వరకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఏపీఆర్) కెమెరాలు 10, స్టాటిక్ కెమెరాలు 169, ఇతర కెమెరాలు 47 ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నామని, నవంబర్ 2లోపు వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వీటితోపాటు డ్రోన్ కెమెరాలు కూడా వినియోగించనున్నట్లు తెలిపారు. పట్టణానికి పది కిలోమీటర్లలోపు వీటిని ఏర్పాటు చేయనున్నట్ల తెలిపారు. వీటిని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేస్తామన్నారు. అత్యాధునిక కెమెరాల సాయంతో వేడుకల్లో భద్రతా లోపాలు తలెత్తకుండా 24 గంటలూ పనిచేసే విధంగా పర్యవేక్షిస్తామన్నారు. కెమెరాల ఏర్పాటుకు సహాయం అందించిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, సీఐలు శివాంజనేయులు, గోపీనాథ్‌రెడ్డితోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సెంట్రల్ ట్రస్ట్ సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు