
‘సూపర్ సేవింగ్స్’తో ప్రజలకు మేలు
గోరంట్ల: ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో భాగంగా జీఎస్టీ స్లాబులు తగ్గించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. నిత్యం వినియోగించే టూత్ పేస్టు నుంచి ఏసీ వరకు, అదేవిధంగా రైతులు వినియోగించే సాగు పరికరాల నుంచి ట్రాక్టర్ వరకు అన్ని వస్తువుల ధరలూ తగ్గుతాయన్నారు. గురువారం గోరంట్ల సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్‌తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ... ‘సూపర్ సేవింగ్స్’పై నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ధర చూడాలన్నారు. ఎక్కడైనా పాత ధరలు ఉంటే వ్యాపారులను ప్రశ్నించాలన్నారు. బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత మాట్లాడుతూ...సవరించిన జీఎస్టీతో పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్ మంత్రి సవితతో కలిసి ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ డీపీఓ సమతతో కలిసి చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పట్టణంలో ర్యాలీ..
ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో చేపట్టిన అంతర్జాతీయ బాలిక దినోత్సవంలో కలెక్టర్ శ్యాంప్రసాద్, మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సర్కిల్ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని, బాలిక విద్యకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్ల వివరించారు. అడపిల్లలు అర్ధంతరంగా చదవు మానకుండా చూడాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్