
వైద్య విద్యను దూరం చేయొద్దు
చిలమత్తూరు: పేదలకు వైద్య విద్య, ప్రజలకు మెరుగైన వైద్యం దూరం చేస్తూ కార్పొరేట్లకు మేలు చేకూర్చడం కోసమే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకొచ్చారని వక్తలు ధ్వజమెత్తారు. పెనుకొండలో మెడికల్ కాలేజీ పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చి ఉంటే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేదన్నారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకురావడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో మంగళవారం చేపట్టిన ఆందోళన విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కూటమి ప్రభుత్వ తీరును నిరసించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి తేవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలు వైద్య విద్యనభ్యసించేందుకు.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారన్నారు. నిర్మాణాలకు శ్రీకారం చుట్టి ఐదు కళాశాలలను పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారన్నారు. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉంటే.. పూర్తి చేసి ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం, అత్యాధునిక వైద్య సేవలు కల్పించాల్సిన కూటమి ప్రభుత్వం తద్విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. పేదలు ఏమైపోతే ఏమి.. కార్పొరేట్లకు లాభాలు చేకూరిస్తే చాలన్నట్టుగా మెడికల్ కాలేజీల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడం సరికాదన్నారు.
పేదలపై కక్ష ఎందుకు?
పేద, బడుగు. బలహీనవర్గాల అభ్యున్నతి కోసం అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుడితే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలపై కక్ష కట్టిందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి.నరసింహమూర్తి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను పీపీపీ విధానంలోకి తేవడం పేదలను వైద్య విద్య, మెరుగైన వైద్య సేవలకు దూరం చేయడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే అన్ని వర్గాలనూ కలుపుకొని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
కాలేజీల నిర్మాణం ప్రభుత్వమే చేపట్టాలి
నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణం భారమవుతుందని, అందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ (పీపీపీ) విధానం తీసుకొస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని వైఎస్సారీసీపీ హిందూపురం నియోజకవర్గ నాయకుడు వేణురెడ్డి అన్నారు. ప్రతి జిల్లాకూ మెడికల్ కాలేజీ – సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తేవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తలిస్తే.. చంద్రబాబు వాటిని ప్రైవేట్‌పరం చేయడానికి కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. పెనుకొండలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం రెండంతస్తులు పూర్తయిందని.. తదుపరి పనులు పూర్తి చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. కాలేజీ అందుబాటులోకి వచ్చి ఉంటే ఎంతోమంది పేదలు స్థానికంగా వైద్య విద్యనభ్యసించే అవకాశం ఉండేదన్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవవసరం లేకపోయేదన్నారు. పేదల ‘డాక్టర్’ కలను ఛిద్రం చేయడం సరికాదన్నారు.
పేదలు జీవించాలా.. వద్దా..?
పీపీపీ విధానంతో మొదలైన ప్రక్రియ చివరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు దారి తీస్తుందని, దీన్ని ఎంతమాత్రమూ ఒప్పుకునేది లేదని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ హిందూపురం నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యమోహన్ అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేసి.. నిర్వహణ జరగాలని తాము ఆందోళన కొనసాగిస్తామన్నారు. బెదిరించినా, కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదన్నారు. అన్ని రంగాలూ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే.. ప్రజలు రాష్ట్రంలో జీవించాలా వద్దా.. అని నిలదీశారు. వైద్య రంగంలో రాణించాలన్న దళితుల ఆశలపై నీళ్లు చల్లొద్దన్నారు. హిందూపురానికి చెందిన నరసింహమూర్తి మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లడం కూటమి సర్కారుకు తగదన్నారు. ఇప్పటికై నా పీపీపీ విధానానికి స్వస్తి పలికి.. నిర్మాణ పనులను ప్రభుత్వమే పూర్తి చేసి మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సూర్యమోహన్, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అమానుల్లా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఫారూఖ్, నాయకులు మలుగూరు శివన్న, నరసింహమూర్తి, శ్రీరాములు, అంబేద్కర్ నవీన్, నరసింహులు, అయూబ్ బేగ్, శంకర, చందు, రవి, హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల నిర్మాణంలోపీపీపీ విధానం దుర్మార్గం
ప్రభుత్వమే నిర్మాణాలు పూర్తి చేసి.. ప్రారంభించాలి
పెనుకొండలో కాలేజీ పూర్తయ్యుంటే
ఎంతో ఊరట కలిగేది
నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు
దళిత, బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వ వైద్యం– విద్యను దూరం చేసేందుకు చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప మండిపడ్డారు. పీపీపీ విధానంలోకి తీసుకొస్తే పేదలు ఉచితంగా చదువుకోవడానికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాస్థాయిలో అధునాతన వైద్య సేవలు ఉచితంగా పొందే అవకాశం కూడా లేకుండా చేయడం తగదన్నారు. సీఎం చంద్రబాబు తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేందుకు మెడికల్ కాలేజీల నిర్మాణాల ప్రక్రియను పీపీపీ విధానంలోకి తెచ్చారని విమర్శించారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైద్య విద్యను దూరం చేయొద్దు