
వైద్యుల సమ్మె ఉధృతం
పుట్టపర్తి అర్బన్: స్టెతస్కోప్ పట్టుకుని రోగుల నాడి చూడాల్సిన వైద్యులు ప్లకార్డులు చేతపట్టుకుని రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. తొలిరోజు సోమవారం నల్ల రిబ్బన్ ధరించి ఓపీ వైద్య సేవలను బహిష్కరించారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రెండో రోజు మంగళవారం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. వైద్య సేవలు స్తంభించడంతో.. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా డీఎంహెచ్‌ఓ కార్యాలయం, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల నుంచి వైద్యులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపి వైద్యసేవలు కొనసాగించేందుకు పురమాయించింది. విషయం తెలుసుకున్న వైద్యులు కోపోద్రిక్తులయ్యారు. జిల్లా వైద్యుల సంఘం అధ్యక్షుడు రాజేంద్ర, జనరల్ సెక్రెటరీ పుష్పలత, ఆర్గనైజింగ్ సెక్రెటరీ దిలీప్‌కుమార్, జాయింట్ సెక్రెటరీ స్వరూపారెడ్డి తదితరులు ప్రసంగించారు. జీఓ 99ను తొలగించాలన్నారు. ప్రమోషన్ల కోసం కొంతమంది 20 ఏళ్ల నుండి వేచి ఉన్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి, సంచార చికిత్సలకు వెళ్లిన వారికి అలవెన్సులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కమిషనర్ వద్ద జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను ఉధృతం చేశామన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు శివరామకృష్ణ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఎలాగని ప్రశ్నించారు. వైద్యులు లేకపోతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో వైద్యులు అందుబాటులో ఉండటం చాలా అవసరమన్నారు.
డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద
రిలే దీక్షలు
పీహెచ్‌సీలకు ఇతర డాక్టర్లను పంపడంపై వైద్యుల ఆగ్రహం