
గొర్రె పిల్లలను మింగిన కొండచిలువ
పుట్టపర్తి అర్బన్: మందలో ఉన్న రెండు చిన్న గొర్రె పిల్లలను కొండ చిలువ మింగింది. ఈ ఘటన పుట్టపర్తి మండలం పైపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి పొద్దుపోయాక సమీపంలోని కొండ నుంచి వచ్చిన భారీ కొండ చిలువ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి విజయ్ మందలోకి చొరబడింది. ఒక పిల్లను మింగేసింది. రెండవ పిల్లను నోట కరుచుకోవడంతో అరుపులు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన విజయ్ తోటి కాపరుల సహకారంతో రెండవ పిల్లను కొండ చిలువ నోటి నుంచి లాగేశారు. అప్పటికే అది మృతి చెందింది. కొండచిలువ ఎటూ వెళ్లలేక మందలోనే ఉండడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పుట్టపర్తికి చెందిన కరుణ సొసైటీ సిబ్బందికి తెలపడంతో వారు వచ్చి కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని బుక్కపట్నం సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి వదిలేశారు.
వైద్యాధికారులు వెంటనే విధుల్లో చేరాలి
● కలెక్టర్, డీఎంహెచ్‌ఓల ఆదేశం
పుట్టపర్తి అర్బన్: ఓపీ సేవలు బంద్ చేసి సమ్మెబాట పట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజాబేగం వేర్వేరుగా ఆదేశాలు జారీ చేశారు. వైద్యాధికారులు సమ్మె బాట పట్టడంతో కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్ మంగళవారం సాయంత్రం పుట్టపర్తిలోని ఎనుములపల్లి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవల్లో ఆటంకం కలగకుండా ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రి ,అనంతపురం మెడికల్ కళాశాల నుంచి 20 మంది వైద్యులను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించి నట్లు చెప్పారు. ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్, ఎస్మా చట్టం ప్రకారం ఇలా సమ్మె చేయడం చట్టరీత్యా అనుమతించబడవన్నారు. ఈ మేరకు వైద్యాధికారులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వెంటనే ప్రభుత్వ వైద్యాధికారులు విధులకు హాజరు కావాలన్నారు. లేనిపక్షంలో సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రోగులతో మాట్లాడారు.

గొర్రె పిల్లలను మింగిన కొండచిలువ