
ప్రశాంతి నిలయంలో దుర్గాష్టమి వేడుకలు
ప్రశాంతి నిలయం: దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దుర్గాష్టమి వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగాయి. సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి బంగారు రథానికి, బాబా జీవించి ఉన్నపుడు వినియోగించిన వాహనాలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయుధ పూజ చేశారు. బంగారు రథాన్ని ఆర్.జె.రత్నాకర్ భక్తులు, సత్యసాయి ట్రస్ట్ సిబ్బందితో కలసి లాగారు. ట్రస్ట్ కార్యాలయాల్లోనూ దుర్గాష్టమి సందర్భంగా ఆయుధపూజ నిర్వహించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ పూర్ణచంద్ర ఆడిటోరియంలో చేపట్టిన వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది. దసరా వేడుకల్లో భాగంగా సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. ప్రముఖ పండితుడు మైలవరపు శ్రీనివాసరావు భక్తులనుద్దేశించి ప్రసంగించారు. దుర్గాదేవి వైభవం, దసరా వేడుకలకు ప్రత్యేకత వివరించారు. సత్యసాయి విశ్వమాతగా భక్తులకు అమ్మ ప్రేమను చూపించారని కొనియాడారు. పిదప సత్యసాయి విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానంద, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశాంతి నిలయంలో దుర్గాష్టమి వేడుకలు