హత్య కేసు దారి మళ్లిందా? | - | Sakshi
Sakshi News home page

హత్య కేసు దారి మళ్లిందా?

Oct 1 2025 10:53 AM | Updated on Oct 1 2025 11:36 AM

హత్య

హత్య కేసు దారి మళ్లిందా?

పుట్టపర్తి టౌన్‌: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో రెండు వారాల కిందట జరిగిన హత్య కేసు దర్యాప్తుపై విమర్శలు వస్తున్నాయి. భార్యతో కలిసి హత్య చేసిన పలువురిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదుదారులను ఏమాత్రం విచారణ చేయకుండా, వారి అనుమానాలను పరిగణనలోకి తీసుకోకుండానే.. పలువురికి ప్రమేయం లేదన్నట్టు క్లీన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది.

ఆనాడు ఏమైందంటే...

బ్రాహ్మణపల్లి తండాకు చెందిన నారాయణ నాయక్‌ కుమారుడు బాలాజీ నాయక్‌ (38)కు జగనన్న కాలనీలో భార్య గాయత్రి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముండేవాడు. పెయింటింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత సెప్టెంబర్‌ 15వ తేదీ రాత్రి భోజనం చేశాక భార్యాపిల్లలతో కలిసి మిద్దైపె నిద్రించాడు. అదేరోజు అర్ధరాత్రి గాయత్రి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చేసరికి బాలాజీనాయక్‌ మిద్దైపె నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమై పడి ఉన్నాడు. వెంటనే ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలాజీనాయక్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ శివాంజనేయులు మరుసటి రోజు ఉదయం జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు. తమ కుమారుడి మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలాజీనాయక్‌ తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. భార్య గాయత్రితో పాటు మరో నలుగురిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ చేపట్టిన పోలీసులు.. బాలాజీనాయక్‌ను చంపింది భార్యేనని తేల్చి.. ఆమెను రిమాండ్‌కు పంపించారు. తర్వాత అదుపులో ఉన్న వారిని విడిచిపెట్టారు.

హత్యకు సహకరించిన వారిపై చర్యలేవీ..?

బాలాజీనాయక్‌ను ఒక్కరే హత్య చేయలేదని, మరికొంతమంది సహకరించారని తల్లిదండ్రులు మంగమ్మ, నారాయణనాయక్‌ ఆరోపిస్తున్నారు. కోడలు గాయత్రితో పాటు సమీప బంధువు అంజీనాయక్‌, మహమ్మద్‌ అలీతో పాటు బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఇందులో ప్రమేయం ఉందని అంటున్నారు. తమ కుమారుడి చావుకు కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని వారు గత సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. పోలీసులు డబ్బు తీసుకుని మిగిలిన వారిని వదిలేసి.. కోడలిని మాత్రమే జైలుకు పంపించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన ఎస్పీ సతీష్‌కుమార్‌ కేసు విచారణ ఫైలు, సీడీలు మరోసారి పరిశీలించి నివేదిక ఇవ్వాలని పుట్టపర్తి పోలీసులను ఆదేశించారు.

న్యాయం జరిగేనా?

హత్య కేసును పుట్టపర్తి అర్బన్‌ పోలీసులు, ఇంటెలిజెన్స్‌ పోలీసులు మరోసారి విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. హతుడి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులతో మరొకసారి మాట్లాడినట్లు సమాచారం, ఎస్పీ ఆదేశాల మేరకు కేసు విచారణ పారదర్శకంగా చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారా..? లేక నీరుగారుస్తారా.. అన్నది వేచి చూడాలి మరి.

భార్య మాత్రమే నిందితురాలని తేల్చిన పోలీసులు

కేసు నుంచి పలువురిని తప్పించారని అనుమానాలు

హత్య కేసు దారి మళ్లిందా?1
1/1

హత్య కేసు దారి మళ్లిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement