
2 నుంచి ప్రత్యేక రైళ్లు
● షోలాపూర్–ధర్మవరం, బీదర్–
బెంగళూరు మార్గంలో..
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ.శ్రీధర్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. షోలాపూర్–ధర్మవరం, బీదర్–బెంగళూరు మార్గంలో రైళ్లు నడుస్తాయన్నారు. అక్టోబర్ 2 గురువారం రాత్రి 11.20 గంటలకు షోలాపూర్ జంక్షన్‌లో రైలు బయలుదేరి ధర్మవరం జంక్షన్‌కు శనివారం తెల్లవారుజూమున 3.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ధర్మవరం జంక్షన్ నుంచి (01438) అక్టోబర్ 4 శనివారం ఉదయం 6.30 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 10.30 గంటలకు షోలాపూర్‌కు చేరుకుంటుందన్నారు. బీదర్, వికారాబాద్, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, పాకాల, పీలేరు, మదనపల్లి రోడ్డు, ములకలచెరువు, కదిరి రైల్వే స్టేషన్ల మీదుగా రైలు రాకపోకలు సాగిస్తుందన్నారు.
బీదర్–బెంగళూరు మధ్య..
బీదర్–బెంగళూరు మధ్య అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు. బీదర్ జంక్షన్ (07063)లో అక్టోబర్ 4 శనివారం మధాహ్నం 2.40 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు రైలు బెంగుళూరు చేరుతుందన్నారు. తిరిగి అక్కడి నుంచి అక్టోబర్ 5 ఆదివారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బీదర్ చేరుకుంటుందన్నారు. హమ్నాబాద్, కమలాపూర్, కలబురిగి, షాహబాద్, వాడీ, యాదగిరి, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, యలహంక సేష్టన్ల మీదుగా రైలు నడుస్తుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ధర్మవరం వరకు
‘సూపర్ ఫాస్ట్’ పొడిగింపు
సత్యసాయి జయంత్యుత్సవాలనేపథ్యంలో రైల్వే శాఖ నిర్ణయం
కదిరి: గుంటూరు – తిరుపతి మధ్య నడుస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (17261)ని ధర్మవరం వరకూ పొడిగించారు. భగవాన్ శ్రీ సత్యసాయి జయంతి (నవంబర్ 23)ని పురస్కరించుకొని రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుండి నవంబర్ 30 వరకు అంటే రెండు నెలల పాటు ఈ రైలు ధర్మవరం వరకు నడుపుతారు. ఆ తర్వాత ఎప్పటి లాగానే తిరుపతి వరకూ వచ్చి ఆగిపోతుంది. రోజూ సాయంత్రం 4.30 గంటలకు ఈ రైలు గుంటూరులో బయలుదేరుతుంది. నరసరావుపేట, వినుకొండ, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లి, కోవెలకుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, కమలాపురం, రాజంపేట మీదుగా తెల్లవారుజామున 3.55 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అక్కడి నుండి 4.05 గంటలకు బయలుదేరి పాకాల, పీలేరు, కలికిరి, మదనపల్లి రోడ్, మొలకలచెరువు, కదిరి మీదుగా ఉదయం 9 గంటలకు ధర్మవరం చేరుకుంటుంది. ధర్మవరంలో మధ్యాహ్నం 1.20కి బయలు దేరి తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7.15కు తిరుపతి చేరుకుంటుంది. 10 నిమిషాల తర్వాత తిరిగి బయలుదేరి మరుసటి దినం ఉదయం 7.20 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. ఈ రెండు నెలల పాటు రోజూ ఒక రైలు (17261) గుంటూరులో సాయంత్రం 4.30కు బయలు దేరితే, ఇంకో రైలు (17262) ధర్మవరంలో మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరేలా రైల్వేశాఖ అధికారులు నిర్ణయించారు.
ఆగని మట్టిదందా
● రాత్రిపూట తరలింపు
కదిరి అర్బన్: అక్రమార్కులు మట్టి దందాను ఆపడం లేదు. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. వీలైనంత మేర మట్టి తవ్వి.. సొమ్ము చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పగలైతే అధికారులు అడ్డుకుంటారని భావిస్తున్న అక్రమార్కులు రాత్రిపూట మట్టి తరలించేస్తున్నారు. యర్రదొడ్డి గ్రామంలో జాతీయ రహదారికి అనుకుని ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్‌కు అక్రమంగా మట్టి తోలుతున్నారు. రాత్రిపూట టిప్పర్లు రాకపోకలు, హిటాచీ యంత్రాల శబ్దాలతో ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. మట్టి మాఫియాను కట్టడి చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ మురళీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా.. మొన్ననే మట్టి తరలింపు ఆపేయాలని హెచ్చరించామన్నారు. అయినా తోలుతున్నారంటే.. వీఆర్‌ఓను పంపించి చర్యలు తీసుకుంటామన్నారు.

2 నుంచి ప్రత్యేక రైళ్లు