
చెరువులో పడి యువకుడి మృతి
ధర్మవరం అర్బన్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని మార్కెట్ వీధికి చెందిన మహేష్ (36)కు భార్య విమల, ఓ కుమారుడు ఉన్నారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో చెరువు మొదటి మరువ వద్ద సోమవారం ఉదయం తన శరీరానికి అయిన రంగులను శుభ్రం చేసుకుంటుండగా అదుపు తప్పి నీటిలో పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మహేష్ చెరువులోని బురదలో కూరుకుపోయి బయటకు రాలేక మృతి చెందాడు. గమనించిన స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, సిబ్బంది అక్కడకు చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మహేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి భార్య విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.