
‘సమగ్ర’లో సీతయ్య
పుట్టపర్తి: జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఎవరి మాట వినని సీతయ్య అందరిపై పెత్తనం చెలాయిస్తూ ఉద్యోగులకు గుదిబండలా మారాడు. పేరుకే చిరుద్యోగి అయినా.. ఉన్నతాధికారులను సైతం ఖాతరు చేయని అతని బాగోతాలు కథలు కథలుగా వెలుగు చూస్తున్నాయి.
మెసెంజర్ సిఫారసు ఉంటేనే పని పూర్తి
డిప్యూటేషన్‌పై జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి నియమితుడైన మెసెంజర్.. బాధ్యతలు తీసుకున్న వెంటనే కార్యాలయం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ (ఏపీసీ)ని సైతం పక్కన పెట్టి అన్ని అధికారాలు తానై చెలాయిస్తూ కేజీబీవీ సిబ్బందికి చుక్కలు చూపించసాగాడు. ఈ క్రమంలో ఏ పని కావాలన్నా ముందుగా ఆయనను ప్రసన్నం చేసుకోవాలి. లేకపోతే ఏ పనీ పూర్తి కావడం లేదనే ఆరోపణలున్నాయి.
ప్రతి పనికీ ఓ లెక్క
మెసెంజర్‌కు ముడుపులు ముట్టజెప్పితేనే సమగ్ర శిక్షలో పనులు పూర్తవుతాయని, లేకపోతే రోజుల తరబడి ఏదో ఒక నెపంతో ఫైల్‌ను పక్కన పెట్టేస్తుంటారని పలువురు బాధితులు వాపోతున్నారు. కేజీబీవీ ఎస్‌ఓల నుంచి బోధన, బోధనేతర సిబ్బంది, ఎమ్మార్సీ, ఇతర సిబ్బంది బదిలీల్లోనూ ఆయనే కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అతను కోరిన మొత్తాన్ని చెల్లించి పనులు చక్కబెట్టుకుంటున్నట్లు పలువురు ఉద్యోగులు బాహాటంగానే పేర్కొంటున్నారు. ఏసీపీ పరిధిలో ఉన్న ఎమ్మార్సీల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది బదిలీలు ఇటీవల జరిగాయి. అయితే 2 నెలలు గడిచినా వారిని ఇప్పటి వరకూ బదిలీ అయిన స్థానాలకు పంపలేదు. ఈ అక్రమాల వెనుక మెసెంజర్ పాత్ర ఉన్నట్లు ఎమ్మార్సీ సిబ్బంది వాపోతున్నారు.
గతంలోనూ వివాదాస్పదమే
గతంలో బాలికల గురుకుల పాఠశాలలో మెసేంజర్‌గా పనిచేసే అవకాశం దక్కినా.. ఆ పాఠశాల బాలికలకు సంబంధించినది కావడంతో ఉన్నతాధికారులు అనుమతించలేదు. దీంతో తనకు ప్రతిగా భార్యకు ఉద్యోగం ఇప్పించి.. అనంతరం కొద్ది రోజులకే కోర్టును ఆశ్రయించి విధుల్లోకి చేరాడు. ఈ క్రమంలో అతని పనితీరు వివాదాస్పదంగానే సాగింది.
ఎస్‌ఓలకు బెదిరింపు
కేజీబీవీలకు సంబంధించి బిల్లులు కావాలంటే మెసెంజర్‌కు ముడుపులు చెల్లించక తప్పడం లేదనే ఆరోపణలున్నాయి. అతను కోరుకున్న మొత్తం చెల్లించకపోతే బిల్లులు సక్రమంగా లేవంటూ కొర్రీలు వేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కేజీబీవీ సిబ్బందిని బ్లాక్‌మెయిల్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సమస్యాత్మకంగా మారిన సమగ్ర శిక్ష కార్యాలయ మెసెంజర్‌పై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
కేజీబీవీ ఎస్‌ఓలను, సిబ్బందిని శాసిస్తున్న చిరుద్యోగి