పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 45 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, మహిళా పీఎస్ డీఎస్పీ ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డి పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెనుకొండ రూరల్: మండలంలోని గుట్టూరు సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న కియా పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సంబంధీకులు ఎవరైనా ఉంటే కియా పోలీసులను (93469 17078) సంప్రదించాలని కోరారు.
బుక్కపట్నంలో విజయనగర రాజుల శాసనాలు
పుట్టపర్తి: బుక్కపట్నంలోని పురాతన లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విజయనగర సామ్రాజ్యం నాటి రెండు శాసనాలు బయటపడ్డాయి. ఈ మేరకు సోమవారం చారిత్రక పరిశోధకుడు, విశ్రాంత హెచ్‌ఎం వెంగన్న, ఉపాధ్యాయులు గోపీ, సురేష్ వెల్లడించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనుల్లో రెండు రాతి స్తంభాలపై శాసనాలు గుర్తించినట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవ రాయలు సోదరుడు అచ్యుత దేవరాయలు ఈ శాసనాలను లిఖించినట్లు తెలిపారు. త్వరలో ఈ శాసనాలపై పూర్తి స్థాయి అధ్యయనం చేయనున్నట్లు వెంగన్న పేర్కొన్నారు.
ఆంధ్రా ప్రెసిడెంట్ జట్టు కెప్టెన్‌గా కోగటం హనీష్
అనంతపురం: ఆర్డీటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే అండర్–19 క్రికెట్ టోర్నీలో ప్రాతినిథ్యం వహించే ఏపీ ప్రెసిడెంట్ జట్టు కెప్టెన్‌గా కోగటం హనీష్ వీరారెడ్డి ఎంపికయ్యాడు. ఆంధ్రా సెక్రెటరీ టీం, ఆంధ్రా ప్రెసిడెంట్ టీం, మధ్యప్రదేశ్, బరోడా జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో పోటీలు జరగనున్నాయి. అనంతపురం జిల్లా నుంచి కోగటం హనీష్ వీరారెడ్డి ఒక్కరే ఈ టోర్నీకి ఎంపిక కావడం గమనార్హం.

పరిష్కార వేదికకు 45 వినతులు