
నకిలీ విత్తనాలతో నిండా ముంచారు
తాడిపత్రి రూరల్: నకిలీ విత్తనాలు అంటగట్టి నిండా ముంచారని రైతులు వాపోయారు. పట్టణంలో వైఎస్సార్ సర్కిల్‌లోని మధుసాయి ట్రేడర్స్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బాధిత రైతులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం శెట్టివారిపల్లికి కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి వెళ్లి తాను తాడిపత్రిలోని మధుసాయి ట్రేడర్స్‌కు చెందిన ఉద్యోగిగా అక్కడి రైతులతో పరిచయం పెంచుకున్నాడు. తమ వద్ద సోహా 007 రకం మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయని, 110 రోజుల్లోనే పంట దిగుబడి వస్తుందని ఆశ చూపి 30 మంది రైతులకు అంటగట్టాడు. దీంతో ఎకరాకు రూ.40 వేల నుంచి 45 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతులు 90 రోజులు కావస్తున్నా పంట సరిగా ఎదగక పోవడంతో మోసపోయిన గుర్తించి తాడిపత్రికి వచ్చి మధుసాయి ట్రేడర్స్ యజమానికి పరిస్థితి వివరించారు. అయినా ఆయన పట్టించుకోక పోవడంతో బాధిత రైతులు సోమవారం తాడిపత్రికి వచ్చి దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేసేంతవరకు వెళ్లేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఏడీఏ రవి ఆదేశాల మేరకు పెద్దపప్పూరు ఏఓ మహితా కిరణ్ అక్కడకు చేరుకుని దుకాణంలోని మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. విచారణ తరువాత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని ఏడీఏ భరసానిచ్చారు.
తాడిపత్రిలో రైతుల ఆందోళన