కనగానపల్లి: మండలంలోని గుంతపల్లి సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం కొండపల్లి గ్రామానికి చెందిన బండి నరసింహులు (59), ముత్యాలు సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై పాతపాల్యం నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. గుంతపల్లి సమీపంలోకి చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్ నడుపుతున్న నరసింహులు ఒక కాలు పూర్తిగా విరిగి పక్కకు పడిపోయింది.
ముత్యాలుకు మోకాలు విరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించింది. తీవ్రంగా గాయపడిన నరసింహులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య నారాయణమ్మ, ఓ కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముత్యాలును అనంతపురంలోని జీజీహెచ్‌కు రెఫర్ చేశారు. ఘటనపై కనగానపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.