
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
బత్తలపల్లి: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుని ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని మాధవ నగర్‌కు చెందిన బత్తుల శ్రీనివాసులు పెద్ద కుమారుడు హేమంత్‌కుమార్ (21)తన స్నేహితులతో కలసి తమ వీధిలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను నిమజ్జనం చేసేందుకు శుక్రవారం బత్తలపల్లి మండలం సంగమేశ్వర క్షేత్రం సమీపంలోని చిత్రావతి నదికి చేరుకున్నాడు. నీటి లోతు చూసే క్రమంలో నదిలోకి దూకిన హేమంత్‌కుమార్... వెనక్కు వచ్చే క్రమంలో ఈత కొట్టలేక నీట మునిగి మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు.
త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి
నల్లచెరువు: వినాయక నిమజ్జనం సందర్భంగా విగ్రహం మీదపడడంతో చెరువు నీటిలో మునిగి ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన మేరకు... నల్లచెరువులో శ్రీ కన్యకా పరమేశ్వరి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి ప్రతిమను శుక్రవారం నిమజ్జనం కోసం ఓరువాయి పంచాయతీలోని చెరువువాండ్లపల్లి సమీపంలోని చెరువుకు తరలించారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు పడుచూరి రోహిత్ అనే యువకుడిపై పడింది. దీంతో విగ్రహంతో పాటు యువకుడు నీటిలో మునిగాడు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్‌ను వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోడంతో తొలుత స్థానిక పీహెచ్‌సీకి అనంతరం కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తీసుకెళ్లారు.