
నేటి తరం క్రీడాకారులకు మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ప్రశాంతి నిలయం: మేజర్ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని నేటి తరం క్రీడాకారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ పిలుపునిచ్చారు. మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవాన్ని శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. హాకీ ఆటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ధ్యాన్‌చంద్ క్రీడానైపుణ్యాన్ని కొనియాడారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా జరిగిన స్కూల్‌గేమ్స్‌లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఉదయ భాస్కర్, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ మొరార్జీయాదవ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.