
ఊరూరా ‘ఎల్లో బెల్ట్’
కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్లలో రెండు రోజుల క్రితం మద్యం బెల్ట్ షాప్ వద్ద టీడీపీ అల్లరి మూకలు పూటుగా మద్యం తాగి పరస్పర దాడులకు దిగాయి. ఈ దాడిలో గాయపడిన కొందరు కదిరి ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. మద్యం మత్తులో డ్యూటీలో ఉన్న వైద్యురాలు రిషితరెడ్డితో పాటు వైద్య సిబ్బంది, సెక్యూరిటీపై దాడులకు దిగారు. మద్యం మత్తులోనే దాడి జరిగిందని ఎస్పీ రత్న కూడా ధ్రువీకరించారు.
..ఇలా జిల్లాలో నిత్యం ఎక్కడోచోట మద్యం మత్తులో ఘర్షణలు జరుగుతున్నాయి. కూటమి సర్కార్ కొలువుదీరినప్పటి నుంచి జిల్లాలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుండగా..తప్పతాగుతున్న మందుబాబులు ఘర్షణలకు దిగి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
కదిరి: ‘‘బెల్ట్ షాప్‌లను సహించేది లేదు. ఎక్కడైనా బెల్ట్‌షాపు ఏర్పాటు చేస్తే రూ.5 లక్షలు జరిమానా విధిస్తాం. మద్యం దుకాణాలకు అనుబంధంగా బెల్ట్ షాప్ ఉంటే దుకాణం లైసెన్స్‌ను రద్దు చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు చెప్పగా.. జిల్లాలో వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామగ్రామానా బెల్ట్ షాప్‌లు వెలిశాయి. మద్యం దుకాణాల నిర్వాహకులే వారి వ్యాపారం కోసం బెల్టుషాపులను ప్రోత్సహిస్తున్నారు. అందుకే జిల్లా వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతోంది. వీటిని అరికట్టాల్సిన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు.
సందు సందులో మందు
జిల్లా వ్యాప్తంగా 8 ఎకై ్సజ్ స్టేషన్‌ల పరిధిలో 87 మద్యం దుకాణాలున్నాయి. ఇవన్నీ దాదాపుగా అధికార టీడీపీ ప్రజా ప్రతినిధుల అనుచరులే నిర్వహిస్తున్నారు. వీటికి అనుబంధంగా మందు సేవించేందుకు ప్రతి మద్యం దుకాణం వద్ద ఒక సిట్టింగ్ రూమ్‌కు కూడా సర్కారు అనుమతి ఇచ్చింది. కదిరిలో మద్యం దుకాణాల్లో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 అదనంగా తీసుకుంటున్నారని మందుబాబులు చెబుతున్నారు. ఇవి కాకుండా జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాప్ ఉంది. ఇవన్నీ అధికార టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. బెల్ట్‌షాప్‌లలో బాటిల్‌పై అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు తీసుకుంటున్నారు. బెల్ట్ షాప్‌లు రోజూ తెల్లవారుజామున 5 గంటలకే తెరిచి అర్ధరాత్రి 1 గంట వరకూ నిర్వహిస్తున్నారు. కదిరి, ధర్మవరం, హిందూపురం, మడకశిర పట్టణాల్లోని బెల్ట్ దుకాణాల్లో చాలా చోట్ల మద్యం సేవించేందుకు సిట్టింగ్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నందున ఎకై ్సజ్ శాఖ అధికారులు అటువైపు తొంగి చూసేందుకు కూడా భయపడుతున్నారు. ఇక తాజాగా జిల్లాలో మరో 12 బార్‌లకు కూటమి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కదిరిలో 3, ధర్మవరంలో 3, హిందూపురంలో 4, మడకశిరలో 1, పెనుకొండలో 1 ఇలా మొత్తం 12 బార్‌ల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ బార్లు కూడా అందుబాటులోకి వస్తే పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం దొరకనుంది.
పేరుకే ఫ్యామిలీ ధాబాలు
జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఫ్యామిలీ ధాబాలు వెలిశాయి. కానీ అక్కడ ముందు చుక్క..తర్వాతే ముక్క ఆర్డర్ చేస్తున్నారు. ధాబాల నిర్వాహకులే కొన్ని చోట్ల మందు సరఫరా చేస్తుండగా... ఇంకొన్ని చోట్ల మద్యం ప్రియులు వెంట సరుకు తెచ్చుకుంటే తాగేందుకు అనుమతిస్తున్నారు. ఇలా తాగి ధాబాల వద్ద గొడవలు జరిగిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి.
టీడీపీ నేతల కనుసన్నల్లో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు
ఫోన్ కొడితే ఏ సమయంలోనైనా
ఇంటికే మద్యం సరఫరా
బాటిల్‌పై రూ.20 నుంచి రూ.40 అదనం
చోద్యం చూస్తున్న
ఎకై ్సజ్ శాఖ అధికారులు