
నిమజ్జనం ప్రశాంతంగా సాగాలి
● అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు
● అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం
● స్పష్టం చేసిన ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాలని, ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే చాలా కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రత్న హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక నిమజ్జనానికి అన్ని భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీజేలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఊరేగింపు సమయంలో ఎవరూ మద్యం సేవించకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలన్నారు. అలాగే రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదన్నారు. శోభాయాత్ర నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేయాల్సిన సమయం ఇప్పటికే కేటాయించి ఉంటారని, ఆ సమయంలోపు నిమజ్జనం పూర్తి చేసుకోవాలన్నారు. బందోబస్త్‌లో భాగంగా అత్యాధునిక ిసీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే పోలీసులు వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిమజ్జనం ప్రక్రియ ముగిసేంతవరకూ ఉత్సవ కమిటీల నిర్వాహకులు, పీస్ కమిటీల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అందరం కలిసి వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూద్దామన్నారు. నిమజ్జనం సమయంలో ఏదైనా సాయం అవసరమైతే డయల్ 100, 112 ఫోన్ చేయాలని సూచించారు.
కడప జైలుకు
నూర్ మహమ్మద్
ధర్మవరం: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న నూర్ మహమ్మద్‌ను మూడు రోజులపాటు విచారించిన పోలీసులు శుక్రవారం పుట్టపర్తి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు కడప జైలుకు తరలించారు. ఈనెల 27న కోర్టు అనుమతితో కడప జైలులో ఉన్న నూర్ మహమ్మద్‌ను కస్టడిలోకి తీసుకున్న ధర్మవరం పోలీసులు మూడురోజులపాటు విచారణ చేపట్టారు. అయితే విచారణలో నూర్ మహమ్మద్ సమాధానాలు దాటవేసే ధోరణి అవలంభించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలతో వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్ చేసినట్లు మాత్రం తేలింది. వాట్సాప్ గ్రూపుల్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంత మందిని ఉగ్రవాదం వైపు మొగ్గు చూపేలా చేశావు అన్న కోణంలో పోలీసులు విచారణ చేసినా.. నూర్ మహమ్మద్ మౌనంగా ఉంటూ సమాధానాలు దాటవేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నూర్ మహమ్మద్ ప్రియురాలు పర్వీన్‌ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను కూడా వివిధ అంశాలపై విచారించారు. ఆతర్వాత ఆమెను కూడా పంపించినట్లు సమాచారం.

నిమజ్జనం ప్రశాంతంగా సాగాలి