
ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ
కదిరి అర్బన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతీని పురస్కరించుకుని శుక్రవారం మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లికి చెందిన పలువురు భక్తులు కదిరి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. స్వాతి నక్షత్రం రోజున గిరిప్రదక్షిణతో పాపాలనుంచి ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణకు భక్తుల నుంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం పలువురు భక్తులు గిరిప్రదక్షిణ చేయగా..ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే గ్రామ ప్రజలు భక్తులకు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.
25 మండలాల్లో వర్షం
పుట్టపర్తి అర్బన్: వాతావరణ మార్పులతో జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ జిల్లాలోని 25 మండలాల పరిధిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా హిందూపురం మండలంలో 32.4 మి.మీ. అమడగూరు మండలంలో 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక రొళ్ల మండలంలో 29.4 మి.మీ, సోమందేపల్లి 24.2, పరిగి 19.6, చిలమత్తూరు 19.2, మడకశిర 19.0, అగళి 18.2, రొద్దం 14.8, గోరంట్ల 14.2, లేపాక్షి 14.2, తనకల్లు 10.8, పెనుకొండ 10.0, అమరాపురం 9.2, నల్లచెరువు 8.4, కొత్తచెరువు 6.6, గుడిబండ 6.4, బుక్కపట్నం 6.0, మిగతా మండలాల్లో 4 – 1.4 మి.మీ మధ్య వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
వైద్యురాలిపై దాడి హేయం
● కదిరి ఆస్పత్రిలో దుండగుల
అరాచకాన్ని ఖండించిన ఐఎంఏ
కదిరి/కదిరి టౌన్: ప్రాణాలు పోసే వైద్యులపై దాడులు హేయమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కదిరి శాఖ సభ్యులు అన్నారు. ఈ మేరకు వారు శుక్రవారం పట్టణంలోని ఐఎంఏ హాలులో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27వ తేదీన కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి మద్యం మత్తులో వచ్చిన కొందరు దుండగులు విధుల్లో ఉన్న వైద్యురాలు రిషిత, నర్సు బాలముణెమ్మ, సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారని, సీసీ టీవీ ఫుటేజీ ద్వారా మిగతా వారినీ గుర్తించి అరెస్టు చేయాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే నిందితులపై వెంటనే కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినందున తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు తీర్మానించారు. కార్యక్రమంలో కదిరి ఐఎంఏ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆజాద్, సెక్రటరీ డాక్టర్ భాస్కర్ నాయక్, ట్రెజరర్ డాక్టర్ విద్యాసాగర్, వైద్యులు సీవీ మధన్‌కుమార్, శ్రీనివాసులు, చంద్రశేఖర్, హర్ష,సాయి, విజయ్ పాల్గొన్నారు.

ఖాద్రీశుడి భక్తుల గిరి ప్రదక్షిణ