
చేనేత కార్మికుడి బలవన్మరణం
చిలమత్తూరు: అప్పుల బాధతో ఓ చేనేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని లాలేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... లాలేపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి (38) సోమందేపల్లిలో మగ్గం నేస్తూ జీవనం సాగించేవాడు. వివాహమైనా సంతానం కలుగలేదు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. సోమందేపల్లిలోనే ఇళ్లు నిర్మించుకున్న సోమశేఖర్‌రెడ్డి ఇందుకోసం అప్పులు చేశాడు. ఇటీవల మగ్గంపై తగినంత రాబడి లేకపోవడం... ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడం.. అప్పులు తీర్చే మార్గం కనిపించక మధనపడేవాడు. ఈ క్రమంలోనే సోమవారం స్వగ్రామం చిలమత్తూరు మండలం లాలేపల్లికి వచ్చిన సోమశేఖర్‌రెడ్డి అప్పుల గురించే కుటుంబీకులకు చెప్పాడు. ఏమైందో ఏమో గానీ మంగళవారం ఉదయమే గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.