
న్యాయవాదిపై ప్రతివాది వర్గీయుల దాడి
పావగడ: ఓ కేసు విషయంగా న్యాయవాదిపై ప్రతివాది వర్గీయులు దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. పావగడ తాలూకా దవడబెట్ట గ్రామానికి చెందిన సుధాకర్.. జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తన స్వగ్రామంలో ఓ ఇంటి వివాదానికి సంబంధించిన లీగల్ నోటీసును ఇటీవల తన ప్రతివాది సణ్ణీరప్పకు పంపారు. దీంతో కక్ష పెంచుకున్న సణ్ణీరప్ప వర్గీయులు మంగళవారం గొల్లరహట్టిలో సుధాకర్‌ను అడ్డుకుని మహిళలతో కలసి 20 మంది దాడి చేశారు. వారి బారి నుంచి తప్పించుకుని దాడిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శేషానందన్, న్యాయవాదులు బాధితుడు సుధాకర్‌ను పరామర్శించారు.