
మరమ్మతుకు వెళ్లి.. మృత్యు ఒడికి
● విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
● లైన్‌మెన్ నిర్లక్ష్యమే కారణమంటూ
భార్య ఫిర్యాదు
తనకల్లు: మండలంలోని ఉస్తినిపల్లి సమీపంలో విద్యుదాఘాతంతో చంద్రశేఖర్ (30) అనే యువకుడు మృతి చెందాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు తెలిపిన మేరకు... విద్యుత్ శాఖ లైన్‌మెన్ షఫీ వద్ద కొద్ది రోజులుగా మండల కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ (చందు) దిన కూలీగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఉస్తినిపల్లి వద్ద ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు చేసి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లైన్‌మెన్ షఫీ, చంద్రశేఖర్ కలసి వెళ్లారు. పనులు చేసే ముందు లైన్‌మెన్ కొక్కంటి లైనుకు ఎల్‌సీ తీసుకోవాల్సి ఉండగా.. వంకపల్లి లైన్‌కు తీసుకున్నాడు. ఇది తెలియని చంద్రశేఖర్ స్తంభం ఎక్కి విద్యుత్ తీగలను తాకగానే షాక్‌కు గురై స్తంభంపైనే మృతి చెందాడు. లైన్‌మెన్ షఫీ నిర్లక్ష్యం కారణంగానే తన భర్త విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోపి తెలిపారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
రొళ్ల: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. రొళ్ల మండలం నసేపల్లి గొల్లహట్టికి చెందిన మారన్న (33)కు భార్య శారదమ్మతో పా టు ఏడాది వయసున్న కుమార్తె ఉన్నారు. జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం మధ్యాహ్నం గ్రామ సమీపం నుంచి గడ్డి మోపు తలపై పెట్టుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో కిందకు వేలాడుతున్న 11కేవీ విద్యుత్ లైన్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మారన్న మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా మారన్న మృతికి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమంటూ స్థానికులు ఆరోపించారు. భూమికి 8 అడుగుల ఎత్తులో 11కేవీ విద్యుత్ లైన్ వేలాడుతున్న విషయాన్ని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు స్పందించలేదని మండిపడ్డారు. వారి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరమ్మతుకు వెళ్లి.. మృత్యు ఒడికి