
ఎస్సీ శ్మశాన వాటిక పూడ్చివేత
●ఎన్‌హెచ్ 342 రోడ్డు పనుల్లో భాగంగా..
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని ముదిగుబ్బ నుంచి కోడూరు వరకూ నిర్మిస్తున్న 342వ జాతీయ రహదారి పనుల్లో భాగంగా పుట్టపర్తి సమీపంలోని కర్నాటక నాగేపల్లి వద్ద బైపాస్ సమీపంలో ఎస్సీ శ్మశాన వాటికను కాంట్రాక్టర్ పూడ్చి వేయడం వివాదాస్పదంగా మారింది. మిగులు మట్టి, బండరాళ్లతో శ్మశాన వాటికను పూడ్చి వేస్తున్నారని పలువురు ఎస్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సమీపంలోని వంక పొరంబోకు స్థలంలో 2.84 ఎకరాల్లో ఒక ఎకరాను ఎస్సీ శ్మశాన వాటికకు 2018లో కేటాయించారు. ఇప్పటికై నా శ్మశాన వాటిక పూడ్చివేతను ఆపాలంటూ గ్రామానికి చెందిన రమేష్, గంగాద్రి, ఆదినారాయణ, సూరి, కేశప్ప, శ్రీరాములు, గంగన్న తదితరులు కోరారు.
భార్యపై దాడి
● పీఎస్‌లో లొంగిపోయిన భర్త
మడకశిర: హైరిస్క్ కేసులో గర్భిణికి ఆస్పత్రిలో వైద్యులు ఎక్కిస్తున్న రక్తంపై అనుమానంతో భర్త దాడికి తెగబడ్డాడు. ఘటనలో గర్భిణికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. మడకశిర మండలం హెచ్‌ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన ఓబులేసు, రాధమ్మ దంపతులు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం రాధమ్మ 9 నెలల గర్భంతో ఉంది. రక్తహీనతతో బాధపడుతున్నట్లుగా గుర్తించిన వైద్యులు ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా రక్తం ఎక్కించుకోవాలని సూచించారు. దీంతో భర్తతో పాటు తన తల్లిని తోడుగా పిలుచుకుని సోమవారం రాత్రి మడకశిరలోని ఏరియా ఆస్పత్రికి చేరుకుంది. ఆమెను అడ్మిట్ చేసుకున్న వైద్యులు.. హిందూపురం నుంచి ఆమెకు అవసరమున్న గ్రూపు రక్తాన్ని తెప్పించి మంగళవారం తెల్లవారుజామున ఎక్కించారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఓబులేసు రక్తం హిందూపురం నుంచి తెప్పించినది కాదని, వేరే వారి నుంచి తీసుకున్న రక్తాన్ని ఎలా ఎక్కించుకుంటావంటూ భార్యతో గొడవపడి బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో రాధమ్మ గట్టిగా కేకలు వేయడంతో రోగులు, వారి సహాయకులు అప్రమత్తమై దాడిని అడ్డుకున్నారు. అప్పటికే రాధమ్మ దవడ కింద లోతైన గాయమైంది. స్పందించిన వైద్యులు ఆగమేఘాలపై ఆమెకు చికిత్స అందించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. దాడి అనంతరం ఓబులేసు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఎస్సీ శ్మశాన వాటిక పూడ్చివేత