
పలువురికి తెలుగు భాషా పురస్కారాలు
హిందూపురం టౌన్: వ్యవహారిక భాషోధ్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగుభాషా దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకుని కవులు, రచయిత్రలకు అందజేసే తెలుగు భాషా పురస్కారాన్ని హిందూపురానికి చెందిన ఉమర్‌ఫారూక్ ఖాన్ అందుకున్నారు. ప్రతి పదం చైతన్యం కోసం, ప్రతి పాదం ప్రగతి కోసం అనే ఆశయంతో లేపాక్షి ఫౌండేషన్ అధ్యక్షుడు వడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో హిందూపురంలోని శేఖర్ స్టడీ సెంటర్ వేదికగా మంగళవారం పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. భారత దేశ నిర్మాణంలో ముస్లిం దేశ భక్తుల పాత్రపై ఉమర్ ఫారూక్ రచించిన ‘భారతీయ ముస్లిం లెజెండ్స్’ పుస్తకాన్ని అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే తాడిపత్రికి చెందిన కనుమ యల్లారెడ్డి రచన ‘మొలక కథలు’, పల్నాడుకు చెందిన అమృతపూడి రేవతి రచన ‘అమృత వర్షిణి’, అనంతపురానికి చెందిన షహనాజ్ రచన ‘దీపం’, చిత్తూరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రచన ‘ఎప్పుడొస్తుందో’, తిరుపతికి చెందిన కృష్ణస్వామి రాజు రచన ‘మీది తెనాలి మాది తెనాలి’, హిందూపురానికి చెందిన కల్లూరు రాఘవేంద్రరావు రచన ‘కల్లూరు సుబ్బారావు జీవిత చరిత్ర’, గుంటూరు కొలకలూరి దేవికారాణి రచన ‘స్వప్న వేణువు’, తిరుపతి లింగుట్ల వెంకటేశ్వర్లు రచన ‘జ్ఞాపక కుసుమాలు’, అశోక్ కుమార్, భాను తేజశ్రీ, తాటి హరీష్, లీలా మనోహర్, మల్లెల గంగాధర్‌ల రచనలకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర జానపద అకాడమీ, అధికార భాషా సంఘం విశ్రాంత చైర్మన్ పొట్లూరి హరికృష్ణ, హిందూపురం మున్సిపల్ చైర్మన్ డీఈ రమేష్‌కుమార్, ఎంఈఓ గంగప్ప, ఉషారాణి, కల్లూరు రాఘవేంద్రరావు, హెల్పింగ్ హ్యాండ్ శ్రీధర్ గౌడ్, సైనిక సంక్షేమ నాయకులు చలపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
వివాహిత ఆత్మహత్య
శెట్టూరు: మండలంలోని పర్లచేడు గ్రామానికి చెందిన వివాహిత గొల్ల శివలింగమ్మ (36) ఆత్మహత్య చేసుకుంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె సోమవారం పురుగుల మందు తాగింది. విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక సోమవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాంభూపాల్ తెలిపారు.