
కార్యదర్శులకు పని ఒత్తిడి తగ్గించండి
పుట్టపర్తి అర్బన్: పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని డీపీఓ సమతను జిల్లా గ్రామ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం డీపీఓను కలసి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సెలవులు, పండుగ సమయాల్లో సర్వేల పేరుతో పని చేయాల్సి వస్తుండడంతో విశ్రాంతి లేక మానసిక ఒత్తిడికి లోనవుతున్నామన్నారు. స్వామిత్వ పథకంలో భాగంగా క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వీటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రామమోహన్, శ్రావణ్‌కుమార ఈశ్వర్, జైపాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, జిల్లాలోని అన్ని పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు.