
‘పరిష్కార వేదిక’కు 240 అర్జీలు
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 240 అర్జీలు అందాయి. కలెక్టర్ చేతన్ అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామీణులు ఎంతో నమ్మకంతో వ్యయ, ప్రయాసలకోర్చి కలెక్టరేట్ వరకూ వచ్చి అర్జీలు ఇస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డి, స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ రామసుబ్బయ్య, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
28న సర్టిఫికెట్ల వెరిఫికేషన్
● నేటి మధ్యాహ్నం నుంచి
కాల్‌లెటర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీ–25కు ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 28న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్, జిల్లా పరిశీలకులు సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు తెలిపారు. అనంతపురం రూరల్ ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని సోమవారం జిల్లా పరిశీలకులు సుబ్బారావు పరిశీలించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరు కానుండడంతో ఏమాత్రం ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సర్టిఫికెట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. జోన్ ఆఫ్ కన్సడరేషన్‌లోకి వచ్చిన అభ్యర్థులకు, వారు దరఖాస్తు చేసుకున్న అన్ని రకాల పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్యర్థులు వారి వ్యక్తిగత డీఎస్సీ–2025 లాగిన్ ఐడీల ద్వారా మంగళవారం మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. కాల్‌లెటర్లలోని సూచనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రం, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులైతే వైకల్య ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడుసెట్ల జిరాక్స్ కాపీలు, ఐదు పాస్‌ఫోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలన్నారు. అభ్యర్థులు 28న ఉదయం 9 గంటలకు పరిశీలన కేంద్రానికి చేరుకోవాలని డీఈఓ ప్రసాద్‌బాబు సూచించారు. వెరిఫికేషన్‌కు హాజరుకాకముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో వ్యక్తిగత డీఎస్సీ లాగిన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఎంపిక మెరిట్, అర్హత, రిజర్వేషన్ నియమ నిబంధనల మేరకే జరుగుతుందన్నారు. వారి వెంట విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మునీర్‌ఖాన్, చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.

‘పరిష్కార వేదిక’కు 240 అర్జీలు