
సచివాలయ ఉద్యోగుల బాహాబాహీ
● విరిగిన పంచాయతీ కార్యదర్శి చేయి
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
గోరంట్ల: కేంద్రం అమలు చేస్తున్న స్వామిత్వ యోజన సర్వే సందర్భంగా ఏర్పడిన వివాదంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ పంచాయతీ కార్యదర్శి చేయి విరిగింది. వివరాల్లోకి వెళితే... మండలపరిధిలోని కమ్మవారిపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీలో సోమవారం పంచాయతీ కార్యదర్శి ఫారుక్ నేతృత్వంలో సర్వేయర్, వీఆర్‌ఓ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ స్వామిత్వ యోజనకు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి ఫారుక్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాలాజీ మధ్య వృత్తిపర వివాదం చెలరేగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పంచాయతీ కార్యదర్శి ఫారుక్ కిందపడగా, చేయి విరిగింది. దీంతో తోటి ఉద్యోగులు ఫారుక్‌ను గోరంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి ఫారుక్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇంజినీరింగ్ అసిస్టెంట్ బాలాజీ కూడా ఈ ఘటనపై ఎంపీడీఓతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యదర్శి ఫారుక్ తనపై దాడి చేశారని పేర్కొన్నారు.
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ చేనేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..ధర్మవరం శివానగర్‌కు చెందిన పామిశెట్టి చౌడయ్య(60) చేనేత కార్మికుడు. మగ్గంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునే వాడు. మగ్గంపై ఎంతగా పనిచేసినా రాబడి అంతంతమాత్రంగానే ఉండటం... ప్రభుత్వం నుంచి సాయం కూడా లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చే మర్గమూ కనిపించక మదన పడేవాడు. ఇటీవల కురిసిన వర్షాలతో మగ్గం పనికూడా చేయలేక ఇబ్బందులు పడ్డారు. రోజుగడవడమే ఇబ్బందిగా మారింది. ఇక అప్పులు తలచుకుని భయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెందిన చౌడయ్య సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య లక్ష్మీదేవి, కుమారుడు సంజీవరాయుడు, కుమార్తె జయలక్ష్మి ఉన్నారు. పిల్లలిద్దరికీ వివాహాలు చేశాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల బాహాబాహీ