
తోడుకున్నోళ్లకు తోడుకున్నంత
సాక్షి, టాస్క్‌ఫోర్స్: జిల్లాలోని రామగిరి మండలం పేరూరు సమీపంలో ఉన్న పెన్నానది నుంచి ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోంది. రోజూ ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పరిటాల కుటుంబం అండతోనే టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఇసుక దందాకు తెరలేపినట్లు ఆరోపణలున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను తరలిస్తుండడంతో పెన్నానది పరివాహక ప్రాంతం గోతుల మయమవుతోంది.
సమాధులనూ తోడేస్తున్నారు....
పేరూరు గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడంతో కొన్నేళ్లుగా ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే సమీపంలోని పెన్నానదిలో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇసుక తవ్వకాలతో సమాధులు పెకలించి వేస్తున్నారు. అస్థిపంజరాలు బయటపడుతున్నాయి. ఇసుకతో పాటు ఎముకలు, పుర్రెలను సైతం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను పెన్నానది నుంచి తరలించి ఓ చోట డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి పొరుగున ఉన్న బెంగళూరు, కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
అడుగంటిన భూగర్బజలాలు...
కొన్నేళ్లుగా పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా తలిరస్తుండడంతో పేరూరుతో పాటు చాలా గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటిపోయాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ విస్తారంగా వర్షాలు కురవడంతో పేరూరు డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో అప్పట్లో ఇసుక దందా కొనసాగించలేకపోయారు. అంతేకాక అప్పటి జగన్ ప్రభుత్వం సైతం ఇసుకను క్రమ పద్ధతిలో విక్రయాలు సాగించడంతో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలకు తావు లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే పేరూరు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపులు ఊపందుకున్నాయి. లక్షల కొద్ది మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమంగా తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించకపోతే పెన్నానది పరివాహక ప్రాంతంలో పంటల సాగు కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని పెన్నానది పరివాహక ప్రాంతం ఇసుక అక్రమ రవాణాదారులకు కాసులు కురిపిస్తోంది. తోడుకున్నోళ్లకు తోడుకున్నంత అనే రీతిలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇసుక అక్రమ వ్యాపారులకు తోడ్పాటునందిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
పరిటాల కుటుంబం అండతో యథేచ్ఛగా ఇసుక దందా
రోజూ ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలింపు
సమాధులను సైతం వదలని వైనం
పట్టించుకోని అధికార యంత్రాంగం