
కారు ఢీ – వ్యక్తి మృతి
చిలమత్తూరు: కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం పుల్లగూర్లపల్లికి చెందిన ఆంజనేయులు (50) ఆదివారం ఉదయం పని కోసం చిలమత్తూరు మండలం కమ్మయ్యగారిపల్లికి వచ్చాడు. పని ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆయన 44వ జాతీయ రహదారిపై కంబాలపల్లి క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా అనంతపురం వైపు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆంజనేయులను 108 అంబులెన్స్ ద్వారా హిందూపురంలోని జిల్లాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
వృద్ధుడి దుర్మరణం
మడకశిర: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు...మడకశిర మండలం వైబీ హళ్లి గ్రామానికి చెందిన చిక్కన్న (72) మడకశిర సమీపంలోని ఓ దానిమ్మ తోటకు కాపలాదారుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం సమీపంలోని మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఓ హోటల్‌లో కాఫీ తాడగానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా హిందూపురం వైపు నుంచి వేగంగా వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామిరెడ్డి, వైబీ హళ్లి పంచాయతీ నాయకులు బాలకృష్ణారెడ్డి, నాగభూషణ్‌రెడ్డి తదితరు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
సీఐపై చర్యలకు
కౌన్సిలర్ డిమాండ్
చిలమత్తూరు: హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక మున్సిపాల్టీ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ ఆసీఫ్‌వుల్లా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం డీఎస్పీ కేవీ మహేష్‌ను కలసి ఫిర్యాదు పత్రం అందజేసి, మాట్లాడారు. శనివారం అల్‌హిలాల్ కాంప్లెక్స్ వద్ద మందులు కొనుగోలు చేసి నిల్చోని ఉండగా పోలీసు జీపులో వచ్చిన సీఐను గమనించి గౌరవంగా నమస్కరించానన్నారు. దీనికి ఆగ్రహంతో సీఐ ఊగిపోతూ చొక్కా పట్టుకుని లాగడంతో అది కాస్త చినిగిపోయిందన్నారు. అలాగే తనను స్టేషన్ వరకూ తీసుకెళ్లి దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానించిన సీఐ రాజగోపాల్‌నాయుడుని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.