
ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి
ధర్మవరం అర్బన్: ప్రజల్లో శాసీ్త్రయ దృక్పథంతో పాటు ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే ప్రభుత్వాలు జవాబుదారీగా వ్యవహరిస్తాయని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అన్నారు. ధర్మవరంలోని ఎన్జీఓ హోంలో ఆదివారం జనవిజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక రంగాలు కార్పొరేట్ల చేతుల్లో చిక్కుకుని వారికి లాభాలు తెచ్చిపెట్టే వనరుగా మారిపోయాయనన్నారు. విద్యా వ్యవస్థలో సృజనాత్మకతకు స్థానం లేకపోగా ర్యాంకులకు ప్రాధాన్యత పెరిగి పిల్లలను పరిశోధనల వైపు ప్రోత్సహించడం సన్నగిల్లిందన్నారు. ఈ మార్పులను అవగాహన చేసుకుని జేవీవీ కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జేవీవీ రాష్ట్ర కోశాధికారి రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ.. సైన్స్‌ను హేళన చేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా చీకటి సామ్రాజ్యాలను నిర్మించుకున్న బాబాలు, స్వామీజీలకు ప్రభుత్వాల నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు దొరకడం బాధాకరమన్నారు. రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ సాకే భాస్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో ప్రజాస్వామ్య విలువలు అడుగంటుతున్నాయన్నారు. ప్రజలు అభద్రతకు లోనవుతున్నారని తెలిపారు. డాక్టర్ ఈటీ రామ్మూర్తి మాట్లాడుతూ.. రచయితలు, కళాకారులు, విద్యార్థులు, ప్రజాస్వామిక శక్తుల మీద, ప్రశ్నించే వాళ్ల మీద దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ టీఎం బషీర్ మాట్లాడుతూ.. శాస్త్ర సాంకేతిక రంగాల ఫలితాలను సామాన్యులకు చేరువ చేయాల్సిన బాధ్యత జేవీవీ కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, కోశాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి సానే రవీంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మహేంద్రరెడ్డి, నర్సారెడ్డి, చైతన్య, గంగిరెడ్డి, గౌస్ లాజం, సురేష్, నిర్ధారణుడు, సంజీవప్ప, లక్ష్మీనారాయణ, షర్ఫుద్దీన్, మహేష్, లోకేష్, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జేవీవీ మహాసభలో
మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్