
ఉదయం రెక్కీ .. రాత్రి దొంగతనం
ధర్మవరం అర్బన్: ఉదయం రెక్కి నిర్వహిస్తారు. రాత్రి దొంగతనం చేసేస్తారు. తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్. ఇంటికి తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసి ఆ బంగారాన్ని బెంగళూరులో విక్రయించే అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ హేమంత్‌కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. పట్టణంలోని కేతిరెడ్డికాలనీకి చెందిన పాల్తూరి రామకృష్ణ అలియాస్ బాలరామకృష్ణన్ తమిళనాడు రాష్ట్రం వేలూరులో నివసిస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా పన్నసముద్రం పంచాయతీ అచ్చంపల్లికి చెందిన భగవంతపు రామంజినప్ప ఇద్దరూ కలిసి ధర్మవరం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు తలుపులు పగలకొట్టి దొంగతనాలు చేసేవారు. రాత్రి సమయాల్లో మహిళల మెడలో బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కోవడం చేసేవారు. ఇద్దరు దొంగలపై ఇప్పటికే పావగడ పోలీస్‌స్టేషన్, ధర్మవరం వన్ టౌన్, టూ టౌన్ పోలీస్‌స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదైనట్లు చెప్పారు. వారిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.9 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇప్పటికే ఇద్దరు దొంగలు దొంగతనం కేసులో కొయంబత్తూర్, అనంతపురం జిల్లాలో శిక్ష అనుభవించారని తెలిపారు. జైలులో ఉన్న సమయంలో ఈ దొంగలు పరిచయం పెంచుకుని బయటకు వచ్చిన అనంతరం దొంగతనాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, టూటౌన్ సీఐ రెడ్డప్ప, హెడ్‌కానిస్టేబుల్ అప్పస్వామి, కానిస్టేబుళ్లు రాజప్ప, షాకీర్‌లు చొరవ చూపారని వారిని డీఎస్పీ అభినందించారు.
తాళం వేసిన ఇళ్లే వారి టార్గెట్
ఇద్దరు అంతరాష్ట్ర దొంగలు అరెస్టు
రూ.9 లక్షలు విలువైన
బంగారు ఆభరణాల స్వాధీనం