
‘జీపీఎఫ్’ లోపాలు సవరించాలి
పుట్టపర్తి: జనరల్ ప్రావిడెంట్ ఫంట్ ఖాతాల్లో తలెత్తిన లోపాలను ప్రభుత్వం వెంటనే సవరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చాలా మంది ఉపాధ్యాయుల ఖాతాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో లోపాలు ఉన్నాయన్నారు. 2023–24 సంవత్సరానికి సంబంధించి కొంత మంది ఉపాధ్యాయులకు అప్‌డేషన్ కాలేదని, మరికొందరు ఉపాధ్యాయుల పీఎఫ్ ఖాతాల్లో క్రెడిట్ తప్పుగా చూపుతోందన్నారు. వెంటనే వాటిని సవరించాలన్నారు.
ఆలయాల్లో దొంగతనం
నల్లచెరువు: మండల కేంద్రంలోని గీతామందిరం, మార్కండేయస్వామి ఆలయాల్లో దొంగలు హుండీలు ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. స్థానికుల వివరాలమేరకు.. కె.పూలకుంట రోడ్డులోని గీతామందిరం, మార్కండేయస్వామి ఆలయాల్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హుండీలు ధ్వంసం చేశారు. అందులోని సుమారు రూ. 40 వేలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. ఆలయ అర్చకులు శనివారం ఉదయం ఆలయంలో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన జరిగిన ఆలయాలను పరిశీలించారు.
వీరభద్రుడి సేవలో డిప్యూటీ సీఈఓ
లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని శనివారం కేంద్ర ఖాదీ, గ్రామీణ చేతివృత్తుల కమిషన్ డిప్యూటీ సీఈఓ మదన్‌కుమార్‌రెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలను తిలకించడంతో పాటు వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. లేపాక్షిలో ఖాదీ, గ్రామీణ చేతి వృత్తుల ఎంపోరియం ఏర్పాటు చేయాలని అన్నదాన సేవా ట్రస్ట్ సభ్యులు సీఈఓకు విన్నవించారు.