
దివ్యాంగులను ఏడిపింఛన్
పుట్టపర్తి అర్బన్: పింఛన్ మొత్తంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎందరో దివ్యాంగుల పట్ల కూటమి సర్కార్ నిర్దయగా వ్యవహరించింది. మంచాలకు పరిమితమైన వారు.. నడవలేని పరిస్థితుల్లో ఉన్న వేలాది మందికి వైకల్య శాతం తగ్గించి పింఛన్ రద్దు చేస్తూ నోటీసులిచ్చింది. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగిరి, ధర్మవరం, బత్తలపల్లి, పెనుకొండ, హిందూపురం తదితర ప్రాంతాల్లో రాజకీయ కక్షతో వైఎస్సార్ సీపీ సానుభూతి పరులైన అర్హులకు పింఛన్ అందకుండా చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.
7,163 పింఛన్ల రద్దు..
జిల్లాలో 34,967 మంది దివ్యాంగ పింఛన్‌దారులు ఉన్నారు. కూటమి సర్కార్ ‘పునఃపరిశీలన’ పేరుతో వీరందరినీ ఆస్పత్రులకు పంపింది. అయితే చాలా ప్రాంతాల్లో వైద్యులు కనీసం దివ్యాంగులను పరిశీలించకుండానే ప్రక్రియ పూర్తి చేశారు. వైకల్య శాతాన్ని ఇష్టానుసారంగా నమోదు చేశారు. దీంతో వైకల్య శాతం 40 శాతంలోపు నమోదైన 7,163 మంది పింఛన్లను తొలగిస్తూ ప్రభుత్వం లబ్ధిదారులకు నోటీసులిచ్చింది. ఇక రూ.15 వేలు, రూ.10 వేల పింఛన్ మొత్తం తీసుకుంటున్న మరో 8 వేల మందికి వైకల్య శాతం తగ్గించింది. వీరందరికీ పింఛన్ మొత్తం తగ్గే అవకాశం ఉంది. దీంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖం చాటేసిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు..
ఆగస్టు 15వ తేదీ తర్వాత పింఛన్ లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది పింఛన్ రద్దు నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లు ముఖం చాటేశారు. నియోజక వర్గాల్లో అందుబాటులో ఉంటే దివ్యాంగులు కార్యాలయాలకు వచ్చి ఇబ్బంది పెడతారన్న కారణంతో కనిపించకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామాల్లో తిరగలేని పరిస్థితి నెలకొందని, ఈ పరిస్థితుల్లో ‘స్థానిక’ ఎన్నికలకు ఎలా వెళ్లాలో తెలియడం లేదని ఓ ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.
రేపు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా..
కూటమి సర్కార్ చర్యను నిరసిస్తూ వేలాది మంది దివ్యాంగులు వికలాంగ సేవా సమితి ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ సోమవారం పుట్టపర్తిలోని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ మేరకు దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షపీ, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా ఏపీ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి కో ఆర్డినేటర్ హరినాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పింఛన్ కోల్పోయిన దివ్యాంగులు, వైకల్య శాతం తక్కువగా నమోదైన దివ్యాంగులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ అర్హులకు పింఛన్ మొత్తం అందించకపోతే ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

దివ్యాంగులను ఏడిపింఛన్

దివ్యాంగులను ఏడిపింఛన్