
ప్రాణం తీసేందుకే ప్లాన్ చేశారా!
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికారం చేతుల్లో ఉంది... అడిగేవారు లేరు... అందుకే హిందూపురం నియోజక వర్గంలో ‘పచ్చ’ బ్యాచ్ రెచ్చిపోతోంది. ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రజల పక్షాన నిలిచే నాయకులను అంతం చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై హత్యాయత్నం చేశారు. వాస్తవానికి ఆయన్ను అంతంచేసేందుకే ప్లాన్ చేసినా అది బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో పాత్రధారులు కనబడుతున్నా... ఎంపీపీ మర్డర్‌కు స్కెచ్ వేసిన సూత్రధారులు ఎవరన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది.
వైఎస్సార్ సీపీ నేతలే టార్గెట్..
చిలమత్తూరు మండలంలో కొందరు టీడీపీ నేతల ఆగడాలు శ్రుతిమించిపోయాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడటం, బెదిరింపులకు దిగడం, అక్రమ కేసులు పెట్టించడం పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతల్లో ముఖ్యంగా కొందరు దోపిడీలకూ తెగిస్తున్నారు. అడ్డం వస్తే బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులను ప్రోత్సహిస్తూ హత్యారాజకీయాలకు దిగడంతో సామాన్యులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
తెరవెనుక సూత్రధారులు ఎవరు...?
ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై జరిగిన హత్యాయత్నంలో అసలు సూత్రధారులు వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎంపీపీ పురుషోత్తమరెడ్డిని సర్వసభ్య సమావేశాలకు రానివ్వకుండా జెడ్పీటీసీ మామ నాగరాజు యాదవ్, బాబూరెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు ఇబ్బందులకు గురిచేశారు. గతేడాది జూలై 24 వ తేదీన ఎంపీడీఓ కార్యాలయం ముందే నాగరాజు యాదవ్ హల్‌చల్ చేశాడు. ఎంపీపీని మండలంలో అడుగుపెట్టనివ్వబోమని హడావుడి చేశాడు. అడ్డువచ్చిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించాడు. అప్పటికే ఎంపీపీ, బాబూరెడ్డి ఓ కేసులో అరెస్టు కాగా ఎంపీపీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. బాబూరెడ్డి మాత్రం బెయిల్ తీసుకోకుండానే బయటకు వచ్చి హంగామా చేశాడు. అప్పటి నుంచి పోలీసుల భద్రత నడుమ ఎంపీపీ సర్వసభ్య సమావేశాలకు హాజరై వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలలు స్తబ్ధతగా ఉన్న మండలంలో మళ్లీ ఎంపీపీపై హత్యా ప్రయత్నం కలకలం రేపుతోంది. ఈ దాడి వెనుక బాబూరెడ్డి ఆయన అనుచరులు ప్రత్యక్ష సూత్రధారులు కాగా, పరోక్షంగా మండలంలోని కీలకమైన టీడీపీ నేత ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎంపీపీకి ప్రాణహాని..
ఎంపీపీ పురుషోత్తమరెడ్డికి ప్రాణహాని ఉందని, పూర్తి భద్రతతోనే గ్రామంలోకి వెళ్లాలని పోలీసులు కూడా హెచ్చరించారు. ఇప్పటికే గ్రామంలో పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఎంపీపీ తన స్వగ్రామమే కదా అన్న ఏమరుపాటుగా ఉండటంతో శుక్రవారం ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.
ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై
హత్యాయత్నం వెనుక
సూత్రధారులెవరు.. ?
‘పురం’ నియోజక వర్గంలో
జోరుగా సాగుతున్న చర్చ