
విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
● ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: గణేశ్ ఉత్సవాల వేళ జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. ఈమేరకు గురువారం గణేష్ ఉత్సవాల మండలపాల ఏర్పాటు, అనుమతులపై విధివిధానాలను ఎస్పీ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మండలపాల ఏర్పాటుకు అనుమతులు సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానంతో పోర్టల్ రూపొందించిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీ సేవ ద్వారా చలానా చెల్లించి ఎన్‌ఓసీ పొందాలన్నారు. అనుమతులు పొంది క్యూఆర్ కోడ్‌ను ఉత్సవాలు నిర్వహించే పందిరిలో తనిఖీలకు వచ్చే అధికారులకు అందుబాటులో ఉంచాలన్నారు. ముందుగా అనుమతి పొందేవారు https://ganeshutsqv.net ద్వారా లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేస్తే అనుమతులు మంజూరు చేస్తారని వివరించారు. గణేశ్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112కు డయల్ చేయాలన్నారు.
సర్టిఫికెట్లతో
రేపు హాజరుకండి
పుట్టపర్తి టౌన్: సివిల్, ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లుగా ఎంపికై న జిల్లా వాసులు ఈనెల 23న గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు అప్లికేషన్‌తో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, నాలుగు పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.
సెక్టోరియల్ ఉద్యోగాలకు
ఇంటర్వ్యూలు
● సిఫారసులకే పెద్ద పీట ?
పుట్టపర్తి: జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో గురువారం బుక్కపట్నం డైట్ కళాశాలలో సెక్టోరియల్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆర్డీఓ సువర్ణ, డీఈఓ క్రిష్ణప్ప, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ దేవరాజ్ పాల్గొన్నారు. మొత్తం 9 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే మెరిట్ లిస్టును పక్కనపెట్టి రాజకీయ నేతలు చెప్పిన వారికే అవకాశం ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే మెరిట్ జాబితా ప్రకటించకుండా ఇంటర్వ్యూలు ఎలా చేపడతారని యూటీఎఫ్ నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు కలెక్టర్‌కు రాసిన లేఖను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డికి సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ 120 మంది దరఖాస్తు చేసుకోగా, 85 మార్కులను అర్హతగా నిర్ణయించారన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరికెన్ని మార్కులు వచ్చాయో చెప్పాలని, లేకపోతే ఇంటర్వ్యూలు రద్దు చేయాలన్నారు.