
‘కప్పలబండ’లో రూ.కోటి గోల్‌మాల్
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండలం కప్పలబండ పంచాయతీలో సుమారు రూ. కోటి నిధులు గోల్‌మాల్ కావడంతో పంచాయతీ సర్పంచ్ చిన్నపెద్దన్న చెక్ పవర్‌ను అధికారులు రద్దు చేశారు. కప్పలబండకు చెందిన శేఖర్ అనే వ్యక్తి నిధుల దుర్వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టడంతో పాటు ఎంపీడీఓ, డీపీఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విచారణ చేపట్టి సర్పంచి చిన్నపెద్దన్నతో పాటు గంగాద్రి నాయక్, గోపాల్‌రెడ్డి, అజయ్‌భాస్కర్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం విచారణ దశలో ఉంది. విషయం తెలిసిన వెంటనే డీపీఓ సమత సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేశారు.
సర్పంచు దంపతుల ఖాతాకు నిధులు..
సర్పంచ్ చిన్నపెద్దన్న 15వ ఆర్థిక సంఘం నిధులు గోల్‌మాల్ చేశారు. ఇందులో సుమారు రూ.57 లక్షలు నిధులు దుర్వినియోగం జరిగినట్లు తెలిసింది. దీంతో పాటు సర్పంచ్ కాక ముందు చిన్న పెద్దన్న గ్రామంలో వాటర్‌మెన్‌గా చాలా కాలం పనిచేశారు. అన్నింటిపై అవగాహన ఉన్న చిన్నపెద్దన్న సర్పంచు అయిన తర్వాత తాగునీరు అందించే ఒక మోటర్ 36 సార్లు మరమ్మతుకు గురైనట్లు బిల్లులు చేశారని, పైప్‌లైను వేయకుండానే వేసినట్లు, కేవలం గేట్ వాల్వ్‌లకు వేలాది రూపాయలు ఖర్చు చేసినట్లు, గ్రామానికి వాటర్ సప్లయ్ చేసినట్లు, ఒక్కో బిల్లును రెండు, మూడేసి సార్లు చేసుకున్నట్లు ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు శేఖర్ చెప్పారు. నిధులన్నీ సర్పంచ్ దంపతుల ఖాతాలకు మళ్లించినట్లు తెలిసింది.
మంత్రి లోకేష్, మాజీ మంత్రి పల్లెకు
సన్నిహితుడు
సర్పంచి చిన్నపెద్దన్న విద్యాశాఖ మంత్రి లోకేష్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి సన్నిహితుడు. గ్రామంలోని ఓ టీడీపీ నాయకుడు గత ప్రభుత్వ హయాంలో బోరు, మోటర్, పైప్‌లైనుకు సుమారు రూ.4.5 లక్షలు ఖర్చు చేశారు. అయితే అతనికి తెలియకుండా సదరు బిల్లును సర్పంచి బిల్లు చేసుకోవడంతో కూటమి నాయకుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పంచాయితీ మాజీ మంత్రి వద్దకు చేరడంతో అందరినీ పిలిపించి బిల్లు సెటిల్ చేయాలని సూచించారు. అయితే బిల్లు చెల్లించకపోవడంతో నిధుల దుర్వినియోగం బయటకు వచ్చింది. ఈ వ్యవహారంలో తలదూర్చవద్దని కొద్దిరోజుల్లో సర్పంచి పదవీ కాలం పూర్తవుతుందని, సర్పంచ్, సిబ్బందిపై చర్యలు తీసుకోవద్దని మాజీ మంత్రి అధికారులకు సూచించినట్లు తెలిసింది.
సర్పంచ్ చెక్ పవర్
రద్దు చేసిన అధికారులు
మంత్రి లోకేష్, స్థానిక ఎమ్మెల్యే కుటుంబానికి సర్పంచ్ చిన్నపెద్దన్న సన్నిహితుడు
మాజీ మంత్రి సూచనతో కేసును
నీరుగారుస్తున్న అధికారులు

‘కప్పలబండ’లో రూ.కోటి గోల్‌మాల్