
ఖాద్రీ ఆలయంలో నేడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పేర్లు నమోదు చేయించుకున్న భక్తులందరూ ఉదయం 10 గంటల కంతా ఆలయానికి చేరుకోవాలన్నారు. వ్రతానికి కావలసిన వస్తువులన్నీ ఆలయ అధికారులే అందజేస్తారు. వ్రతానికి వచ్చే మహిళలు కలశం వెంట తీసుకురావాలని సూచించారు.
యువకుడి హత్య
ధర్మవరం అర్బన్: స్థానిక ఎల్‌పీ సర్కిల్‌లోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద ఓ యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. హతుడిని ఎల్–3 కేతిరెడ్డి కాలనీకి చెందిన పాళ్యం ధనుంజయ(26)గా గుర్తించారు. భార్య శ్రుతి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. బైక్ మెకానిక్‌గా కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ కలహాలతో భార్య గొడవ పడి కొంత కాలం క్రితం బళ్లారిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ధనుంజయ తన తల్లిదండ్రుల వద్దనే నివాసముంటున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద వ్యాయామం చేసుకునే స్థలంలో ధనుంజయ తలపై ఓ దుండగుడు సిమెంట్ ఇటుక వేసి హతమార్చాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. హతుడి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రైతు బలవన్మరణం
అమరాపురం: మండలంలోని నగోనపల్లికి చెందిన రైతు గొల్ల కృష్ణప్ప (59) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గొల్ల కృష్ణప్పకు భార్య సవీరమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేశారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల క్రితం కృష్ణప్ప వెను నొప్పితో బాధపడుతున్నాడు. దావణగెర, తుమకూరు, బెంగళూరు, పావగడ, అమరాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. తరచూ నొప్పికి తాళలేక విలవిల్లాడేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన గురువారం తన పొలం పక్కనే ఉన్న తుగ్గలి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సవీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
రిమాండ్‌కు రౌడీ షీటర్ పవన్
కదిరి టౌన్: రెండు రోజుల క్రితం సాయికిషోర్ అనే యువకుడిపై హత్యాయత్నం చేసిన కేసులో పరారీలో ఉన్న రౌడీ షీటర్ పవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలు గురువారం సీఐ నారాయణరెడ్డి వెల్లడించారు. అందిన పక్కా సమాచారంతో బుధవారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పవన్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, గురువారం న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివ, సాయికుమార్, కళ్యాణ్ పరారీలో ఉన్నారన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
భార్యకు అవమానం..
భర్త ఆత్మహత్య
వజ్రకరూరు: తన భార్యకు జరిగిన అవమానాన్ని తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన బాలతిమ్మరాజు (40)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం సాయంత్రం కాయగూరలను ఫ్రిజ్‌లో పెట్టేందుకు భార్య పక్కింటికి వెళ్లింది. ఆ సమయంలో పక్కింటి యజమాని కురుబ నాగార్జున ఆమెను బలత్కారం చేయబోయాడు. ప్రతిఘటించి ఇంటికి చేరుకున్న భార్య జరిగిన విషయాన్ని భర్తకు తెలపడంతో బాలతిమ్మరాజు నేరుగా వెళ్లి నిలదీశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. దీంతో గ్రామంలో పరువు పోయిందనే మనోవేదనతో తిమ్మరాజు బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక గురువారం బాల తిమ్మరాజు మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కురుబ నాగార్జునతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.
అంగన్‌వాడీల
వేతనాలు పెంచాలి
● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు
కదిరి టౌన్: అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలను రూ.26 వేలకు పెంచాలని ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. కదిరి ఐసీడీఎస్ కార్యాలయంలో గురువారం జరిగిన అంగన్‌వాడీ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. అనంతరం కదిరి ప్రాజెక్స్ నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షురాలిగా ప్రమీలమ్మ, కార్యదర్శిగా సుజాత, కోశాధికారిగా ఎలిజబెత్ రాణిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాబున్నీషా, శ్రీదేవి, సీఐటియూ నాయకులు జగన్‌మోహన్, బాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.

ఖాద్రీ ఆలయంలో నేడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు