
డిగ్రీ పాఠ్యాంశంగా డాక్టర్ ప్రగతి కవిత
హిందూపురం టౌన్/అనంతపురం ఎడ్యుకేషన్: హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రగతి రాసిన కవిత డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశం కానుంది. ఈ మేరకు డిగ్రీ సిలబస్ కమిటీ చైర్మన్ సుంకర గోపాలయ్య గురువారం వివరాలనందించారు. అనంతపురానికి చెందిన డాక్టర్ ఉమ్మడిశెట్టి రాధేయ రచించిన ‘మగ్గం బతుకు’ అనే దీర్ఘ కవితను డిగ్రీలో స్పెషల్ తెలుగు చదువుకునే వారికి ఆరో సెమిస్టర్‌లో పాఠ్యాంశంగా చేర్చారు. అలాగే డాక్టర్ ప్రగతి రాసిన ‘బొగ్గుల పొయ్యి’ కవిత బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సెమిస్టర్‌లో జనరల్ తెలుగు చదువుకునే విద్యార్థులకు సిలబస్‌గా చేర్చారు. అనంత కవుల కవితలను డిగ్రీ విద్యార్థుల పాఠ్యాంశాలుగా చేర్చడంపై సాహితీ స్రవంతి, డాక్టర్ ఉమ్మడిశెట్టి రాధేయ ఫౌండేషన్, డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి, జిరసం, అరసం, తెలుగు వెలుగు సాహితీ సంస్థల ప్రతినిధులు, హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం హర్షం వ్యక్తం చేశారు.
ఒకే ఈతలో రెండు దూడలు
పుట్టపర్తి టౌన్: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని బీడుపల్లికి చెందిన మహిళా రైతు లక్ష్మీదేవి కుమారుడు రంగప్ప పెంచుతున్న పాడి ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. ఇందులో ఒకటి ఆడ, మరొకటి మగ దూడ ఉంది. రెండూ ఆరోగ్యంగా ఉన్నట్లు పశు వైద్యాధికారి తెలిపారు. విషయం తెలుసుకున్న రైతులు, స్థానికులు రంగప్ప ఇంటికి చేరుకుని దూడలను ఆసక్తిగా గమనించారు.

డిగ్రీ పాఠ్యాంశంగా డాక్టర్ ప్రగతి కవిత