
విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి
కనగానపల్లి: విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం బద్దలాపురం గ్రామానికి చెందిన సీపీఐ అనుబంధ వ్యవసాయ కూలీ సంఘం మండల కార్యదర్శి తలారి రాజన్న (56)కు భార్య సరోజమ్మ, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. కనగానపల్లిలో బుధవారం చేపట్టిన చెరువు కట్ట మరమ్మతు పనుల్లో కొలతలు గుర్తించేందుకు ఇరిగేషన్ అధికారుల పిలుపు మేరకు రాజన్న దినసరి కూలికి వెళ్లాడు. విద్యుత్ లైన్ కింద కొలతలు తీస్తుండగా అతను పట్టుకున్న స్టాపర్ (స్టీల్ రాడ్) విద్యుత్ తీగలకు తగిలి షాక్‌కు గురై కిందపడ్డాడు. ఇరిగేషన్ సిబ్బంది గుర్తించి స్థానిక పీహెచ్‌సీకి తరలించేలోపు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, తెలుసుకున్న రైతు సంఘం నాయకులు మహదేవ్, గోవిందు, మల్లికార్జున, పలువురు సీపీఐ నాయకులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి వెళ్లి మృతుడు రాజన్న మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు.
యువకుడి ఆత్మహత్య
లేపాక్షి: ఖాళీగా ఇంటి పట్టున ఉండకుండా ఏదైనా పని చూసుకోవాలని తల్లి హితవు పలకడంతో క్షణికావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నివాసి భూదేవికి కర్ణాటకలోని గౌరీబిదనూరుకు చెందిన రవిచంద్రకుమార్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. 15 సంవత్సరాల క్రితం భర్తను వదిలేసి ఇద్దరు కుమారులతో కలసి లేపాక్షి మండలం తిలక్‌నగర్‌కు వలస వచ్చిన ఆమె ఓ ఇల్లు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడ్డారు. పెద్ద కుమారుడు గౌదీబిదనూరులో పనిచేస్తుండగా, రెండో కుమారుడు ఆకాష్ (28) కియా కంపెనీలో పనికి వెళ్లేవాడు. 3 నెలలుగా పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండడంతో ఏదైనా పని చూసుకోవాలని, పనికి పోకపోతే జీవనం ఎలా సాగుతుందని తల్లి మంగళవారం మందలించింది. అనంతరం సాయంత్రం భూదేవి గౌదీబిదనూరుకు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆకాష్ ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కింటి వారి నుంచి సమాచారం అందుకున్న భూదేవి రాత్రికి రాత్రే ఇంటికి చేరుకుని కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
ఖరీఫ్ పంటల పరిశీలన
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన వివధ రకాల పంటలను కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ నాయక్, ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రామసుబ్బయ్య, ఏడీ కృష్ణమీనన్ తదితరులు పరిశీలించారు. పుట్టపర్తి, కొత్తచెరువు, సోమందేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో బుధవారం వారు పర్యటించారు. రైతులతో కలసి పంటలను పరిశీలించారు. చీడపీడలు, ఎరువుల వినియోగం, తదితర విషయాలపై పలు సూచనలు చేశారు. బోర్ల కింద ముందస్తుగా సాగు చేసిన వేరుశనగలో మచ్చ తెగులు, కాండము కుళ్లు ఆశించినట్లుగా గుర్తించారు. నివారణకు ఎక్సాకొనజోల్ 2ఎంఎల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల కింద ఉలవ, జొన్న, పెసర, అలసందలు విత్తుకోవాలని సూచించారు. కంది పంటలో సాళ్లు ఒత్తుగా ఉంటే 20 సెంటీమీటర్లకు ఒక మొక్క ఉంచి మిగిలినవి తొలగించాలన్నారు. మొక్కజొన్న పంటలో 30, 40, 60 రోజులకు ఎకరాకు 50 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలన్నారు. వరిలో కాలి బాటలు వదలాలన్నారు. రాగికి మంచి గిట్టుబాటు ధరలు ఉన్నాయని వర్షాల ఉంచి పంటను సంరక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల విస్తరణాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి